TSRTC: ఇక బస్సులపై ప్రకటనలు ఉండవు.. అతిక్రమిస్తే...

22 Nov, 2021 10:45 IST|Sakshi

కీలక నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ 

ఏటా రూ.20 కోట్ల ఆదాయాన్ని పణంగా పెట్టి మరీ.. 

బస్సులు పాడవుతున్నాయన్న ఉద్దేశంతో నిర్ణయం 

అక్రమంగా పోస్టర్లు అతికిస్తే క్రిమినల్‌ కేసులే

సాక్షి, హైదరాబాద్‌: బస్సులపై ప్రకటనల విధానానికి ఆర్టీసీ స్వస్తి పలికింది. ఇంతకాలం బస్సులపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అనుమతించింది. దీన్ని ఆదాయ మార్గంగా చేసుకుంది. వీటి రూపంలో సాలీనా సగటున రూ.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ పొందుతోంది. కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇప్పుడు ఈ ప్రకటనల విధానాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుంచి ఆర్టీసీ బస్సులపై ఎలాంటి ప్రకటనలను అనుమతించదు. ఎవరైనా.. ప్రకటనల పోస్టర్లను అతికిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. తాజాగా హైదరాబాద్‌ నగరంలో కొన్ని సంస్థలకు ఆర్టీసీ నోటీసులు జారీ చేసింది. వాటిపై పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతోంది.  
(చదవండి: ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్‌ రాసి..)

ఆర్టీసీ బ్రాండ్‌కు అడ్డు.. బస్సులపై మరకలు 
చాలా కాలంగా ఆర్టీసీ బస్సులపై ప్రైవేటు సంస్థలు ప్రకటనలు ఏర్పాటు చేసుకునే విధానాన్ని సంస్థ అనుసరిస్తోంది. క్రమంగా సంస్థ నష్టాల బాట పడుతుండటంతో అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆదాయ మార్గంగా చేసుకుని, ప్రకటనల విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది. ప్రకటనల సంఖ్య పెరిగేలా ప్రత్యేకంగా ప్యాకేజీలను కూడా ప్రకటించేది. ఇదిలా ఉండగా ఆర్టీసీని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న ఎండీ సజ్జనార్, తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బస్సులపై ప్రకటనలు ఏర్పాటు చేస్తుండటంతో, ఆర్టీసీ లోగో, ఆ బస్సు కేటగిరీ పేరు కూడా కనిపించని గందరగోళం నెలకొంది. అది ఎక్స్‌ప్రెస్‌ బస్సా, ఆర్డినరీ బస్సా అని కూడా గుర్తించలేక కొందరు డ్రైవరును అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. అన్నింటికంటే మించి, పోస్టర్ల వల్ల బస్సు బయటి భాగం అసహ్యంగా మారుతోంది. గతంలో ప్రకటలను ఆర్టిస్టులు రంగులతో గీసేవారు.

ఆధునిక పరిజ్ఞానం విస్తరించి వినయిల్‌ పోస్టర్ల విధానం రావటంతో రంగులు వేసే పద్ధతి మాయమైంది. ప్రకటనల చిత్రాలు, రాతలను వినయిల్‌ పోస్టర్లపై ముద్రించి వాటిని బస్సులపై అతికిస్తున్నారు మళ్లీ ఆ ప్రకటన గడువు తీరాక పోస్టర్లను తొలగిస్తారు. తొలగించిన తర్వాత దానికి వాడిన జిగురు అలాగే అతుక్కుని ఉంటోంది. దానికి దుమ్ము, వాహనాల పొగ, ఇతర చెత్త అతుక్కుని బస్సు అందవిహీనంగా మారుతోంది.

మహిళల ఫిర్యాదుపై స్పందన..
ఇటీవల ట్విట్టర్‌లో వచ్చే ఫిర్యాదులపై ఎండీ సజ్జనార్‌ తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ఈ ప్రకటనలపై ఫిర్యాదులు చేశారు. అర్ధనగ్నంగా ఉన్న మహిళల చిత్రాలతో కూడిన సినిమా ప్రకటనలు ఇబ్బందిగా ఉన్నాయని, ఆ బొమ్మలు మహిళలను కించపరిచేలా ఉంటున్నాయని, వాటిని చూస్తూ ఆకతాయిలు రోడ్లపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి ఆధారంగా ఆయన అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పోస్టర్ల వల్ల ఇబ్బందులున్నాయని, వాటిని నిలిపివేయాలని తాను చాలా కాలంగా కోరుతున్న విషయాన్ని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మిగతా అధికారుల అభిప్రాయాలు కూడా తీసుకుని సజ్జనార్‌ ప్రకటనలపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా ఎవరు పడితే వారు బస్సులపై ప్రకటనల పోస్టర్లు అతికించటం కూడా అలవాటుగా ఉండేది. ఇప్పుడు దానిని సజ్జనార్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఎవరైనా అలా అతికిస్తే ఆ సంస్థపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను అదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టే బాధ్యతను ఆయా డిపో మేనేజర్లకు అప్పగించారు. వారు ఎక్కడికక్కడ కేసులు పెట్టడం ప్రారంభించారు. 
(చదవండి: కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు)

మరిన్ని వార్తలు