..అంతకుమించి.. బీజేపీ దృష్టి మొత్తం ఆ సభ మీదే!

9 May, 2022 00:39 IST|Sakshi

14న అమిత్‌షా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ 

రాహుల్‌ సభకు దీటుగా విజయవంతం చేయాలని యోచన 

ఒక్కో పోలింగ్‌ బూత్‌ నుంచి కనీసం 20 మంది సమీకరణకు కసరత్తు 

సభ ఏర్పాట్లపై జిల్లా పార్టీ నేతలతో బండి మంతనాలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోటాపోటీ బహిరంగ సభలతో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ 21వ వ్యవస్థాపక సభలో కేంద్రంపై విమర్శలతో సీఎం కేసీఆర్‌ రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ బహిరంగ సభలు.. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ఉండగానే పొలిటికల్‌ హీట్‌ను సృష్టించాయి.

మధ్యమధ్యలో అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్‌.. విపక్ష పార్టీలకు ఎప్పటికప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లతో సమాధానం ఇస్తున్నారు. ఈనెల 14న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభపై అందరి దృష్టి నెలకొంది. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో బీజేపీ ఎన్నికల ఎజెండా ప్రకటన.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రూపాంతరం చెందేందుకు పార్టీ నాయకత్వానికి అమిత్‌షా ఎలా దిశానిర్దేశం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.  

నియోజకవర్గానికి 5 వేలకు తక్కువ కాకుండా.. 
మహేశ్వరంలోని తుక్కుగూడ వద్ద అమిత్‌షా పాల్గొనే బండి సంజయ్‌ ‘ప్రజాసంగ్రామ యాత్ర– 2’ ముగింపు బహిరంగ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల వరంగల్‌లో రాహుల్‌ పాల్గొన్న సభకు దీటుగా జన సమీకరణ జరిపి సక్సెస్‌ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సభ విజయవంతం చేసి తెలంగాణలో పార్టీ బలోపేతమై పటిష్టంగా మారిందనే సంకేతాలను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

జన సమీకరణలో భాగంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి కనిష్టంగా 20 మందిని తరలించాలని, నియోజకవర్గానికి 5 వేలకు తక్కువ కాకుండా ప్రజలు సభకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించింది. రాహుల్‌ సభ కంటే ఎక్కువ మందిని సమీకరించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలని భావిస్తోంది.  

సంజయ్‌ మంతనాలు, టెలికాన్ఫరెన్స్‌లు... 
అమిత్‌షా సభ ఏర్పాట్లలో భాగంగా సంజయ్‌ రెండ్రోజులుగా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. జిల్లాల వారీగా టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో భేటీ అయిన బండి జన సమీకరణ, ఇతర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆదివారం పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో వేర్వేరుగా టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలు చెబుతున్నారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా ఎడారిని తలపిస్తోందని, ఎటు చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ కేంద్రాల్లో నిర్వహించిన సభలు సక్సెస్‌ అయ్యాయని.. వీటికి కొనసాగింపుగా కనీవినీ ఎరగని రీతిలో ముగింపు సభకు జనాన్ని తరలించాలని సూచించారు. దూర ప్రాంత మండలాల నుంచి వెయ్యి– ఐదు వేల మంది వరకు.. హైదరాబాద్‌ సమీప జిల్లాలు, మండలాల నుంచి 5–10 వేల మంది చొప్పున జన సమీకరణ చేయాలని చెప్పారు. కరెంట్‌ బిల్లులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు