‘ఎల్‌ఆర్‌ఎస్‌’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన

31 Jan, 2021 01:45 IST|Sakshi

యజమానులెవరో తెలియక ఇంతకాలం విధించలేదు

పురపాలికలు, పంచాయతీల చేతికి త్వరలో వివరాలు 

వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పన్నులు విధించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుదారులపై ఖాళీ స్థలాల పన్ను (వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) పడబోతోంది. యజమానులు ఎవరో, వారి చిరునామా తెలియక ఇంతకాలం పాటు అత్యధిక శాతం ఖాళీ స్థలాలపై ప్రభుత్వం పన్నులు విధిం చలేకపోయింది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల నుంచి ప్లాటు విస్తీర్ణం, యజమాని పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలను సేకరించింది. ప్లాట్ల క్రమబద్ధీకరణతో పాటు వీటిపై ఖాళీ స్థలాల పన్ను మదింపునకు ఈ డేటా బేస్‌ను ప్రభుత్వం రెండు విధాలుగా వినియోగించుకోబో తోంది. గతేడాది ఆగస్ట్‌ 31న ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ట ణాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని 25.59 లక్షల అనధికార ప్లాట్లు, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులొచ్చాయి.

ఈ ప్లాట్లు, లే–అవుట్లు సమీప భవిష్యత్‌లో వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ పరిధిలోకి రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే వీటిపై సంబంధిత పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఈ మేరకు పన్నులు విధించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని కోసం ఎల్‌ఆర్‌ఎస్‌–2020 డేటా బేస్‌ను త్వరలో ఆయా పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందజేయనుందని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ వివరాల ఆధారంగా ఖాళీ స్థలా లపై విధించే పన్నును స్థానిక పురపాలికలు/గ్రామ పంచాయతీలు మదించి దరఖాస్తుదారుల చిరునామాకు డిమాండ్‌ నోటీసులు పంపించే అవకాశముంది. 

100% పన్నులు వసూలే లక్ష్యం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 శాతం వ్యవసాయేతర ఆస్తులపై ఆస్తి పన్నులు, వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్, పన్నేతర చార్జీల వసూళ్లను 100 శాతం జరపాలని, దీంతో అన్ని పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఆదాయపరంగా స్వయం సంవృద్ధి సాధిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల్లో పన్నులు, చార్జీలను ఆయా సేవల కల్పనకు అవుతున్న వాస్తవ వ్యయం మేరకు ఎప్పటికప్పుడు పెంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్ధేశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు, వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ పరిధిలోకి రాకుండా మిగిలిన పోయిన గృహాలు, ఖాళీ స్థలాలను పన్నుల పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

గతంలో సైతం డేటాబేస్‌తో పన్నులు
ధరణి పోర్టల్‌ రూపకల్పన కోసం గతేడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నిర్వహించిన సర్వేలో ఆస్తి పన్నుల పరిధిలోకి రాని 1,09,735 గృహాలను పురపాలకశాఖ గుర్తించింది. వీటిపై ఆస్తి పన్ను విధించాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టినప్పుడు సైతం దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా ప్లాట్లపై ఖాళీ స్థలాల పన్నులను స్థానిక పురపాలికలు విధించాయి. అనుమతి లేకుండా/అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై.. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా జరిమానాలుగా వసూలు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు పేర్కొంటున్నాయి.

అయితే అక్రమ కట్టడాలు, ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు లేక గతంలో జరిమానాలు విధించలేకపోయారు. బీఆర్‌ఎస్‌–2015 కింద అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, అందులో ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండటంతో, ఆయా కట్టడాలపై జరిమానాలను విధించడానికి సమాచారాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంది. బీఆర్‌ఎస్‌–2015 అమలుపై హైకోర్టు స్టే విధించడంతో దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు జరిమానాలు చెల్లించక తప్పట్లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు