8కి ముందే ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు 

28 Oct, 2021 05:04 IST|Sakshi

అధికారులకు సీఎస్‌ సూచన 

పోడు భూముల దరఖాస్తుల స్వీకరణపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల 8 నుంచి పోడు భూముల సమస్యపై దరఖాస్తుల స్వీకరణకు ముందే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందుపరిచే అంశాలు, ఇతర విషయాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

పోడు భూములపై హక్కుల విషయంలో నవంబర్‌ 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ బుధవారం సచివాలయంలో అటవీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమా వేశం నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని పేర్కొన్నారు.

పోడు భూములు అత్యధిక విస్తీర్ణం ఉన్న ప్రాంతాలకు సీనియర్‌ అటవీ శాఖ అధికారులను నియమించాలని సీఎస్‌ సూచించారు. అటవీ శాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, రెవెన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, సీఎంవో ఓఎస్‌డీ ప్రియాంకా వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు