36 మందిపై వేటు.. సర్‌‘పంచ్‌’!

28 Sep, 2020 04:26 IST|Sakshi

విధినిర్వహణలో నిర్లక్ష్యంపై ఫైర్‌

వారం రోజుల్లో 36 మందిపై వేటు

కార్యదర్శులు, ఎంపీవోలపైనా చర్యలు 

కొత్త చట్టంతో కొరడా ఝళిపిస్తున్న సర్కారు

సస్పెన్షన్లపై సర్పంచ్‌ల్లో ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: లెక్కతప్పిన సర్పంచ్‌లకు పంచ్‌ పడింది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినవారిపై ఒక్కొక్కరిగా వేటు పడుతోంది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన 36 మంది సర్పంచ్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు సస్పెండ్‌ చేయడం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నా.. పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల జాప్యం, పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠ ధామాలను నిర్మించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. పనితీరు సంతృప్తికరంగాలేని సర్పంచ్‌లపై కొరడా ఝళిపిస్తోంది. అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో), పంచాయతీ కార్యదర్శులపైనా కన్నెర్ర జేసింది. దీంతో పంచాయతీ పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  

వేటు వేశారిలా..! 
గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ చట్టంలో కఠిన నిబంధనలను పొందుపరిచింది. 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్, కార్యదర్శులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేసింది. అక్రమార్కులకు నోటీసులు, వివరణలతో కాలయాపన చేయకుండా.. తక్షణమే సస్పెన్షన్‌ వేటు వేసేలా చట్టంలో పేర్కొంది. కేవలం నిధుల దుర్వినియోగమేకాదు.. పారిశుద్ధ్య నిర్వహణలో విఫలమైనా, కార్యక్రమాల అమలులో వెనుకబడినట్లు తేలినా వారి పదవులకు ఎసరుపెడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లె ప్రగతి నిర్వహణ, హరితహారం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలకు స్థలాల ఎంపికలోనూ జాప్యాన్ని ప్రదర్శించిన పలువురు సర్పంచ్‌లపై వేటు వేసింది. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో సర్పంచ్‌లు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని కలెక్టర్లతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పెదవి విరిచారు. అంతే.. అప్పటివరకు సర్పంచ్‌లపై ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లు ఉన్న కలెక్టర్లు.. వెంటనే సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల వ్యవధిలో 36 మంది గ్రామ సర్పంచ్‌లపై వేటు పడింది. అలాగే 92 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీవోలపైనా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. మరికొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

చట్టం ఏం చెబుతుందంటే.. 
► పంచాయతీరాజ్‌ చట్టం–2018 సెక్షన్‌ –37(5) విధుల పట్ల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, అలసత్వం, అక్రమ వసూళ్లకు పాల్పడినవారిని తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది. 
► సెక్షన్‌ 284 ప్రకారం.. డిసెంబర్‌ 31లోపు నిధు ల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ రిపోర్టు సమర్పించని పక్షంలో నోటీసులు ఇవ్వకుండా సర్పంచ్, కార్యదర్శులను తొలగించవచ్చు.  
► సెక్షన్‌ 43 ప్రకారం.. రికార్డుల నిర్వహణ, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, 100% ఇంటి పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో పనిచే యని కార్యదర్శులపైనా చర్యలు తీసుకోవచ్చు. 
► సెక్షన్‌ 37(5) ప్రకారం.. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఉపసర్పంచ్‌లపైనా కూడా చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లు ఉంది.

ప్రభుత్వ తీరు సరికాదు 
కొత్త చట్టాన్ని అస్త్రంగా చేసుకొని సర్పంచ్‌లపై వేటు వేయడం సరికాదు. స్థలాల లభ్యత లేకపోతే సర్పంచ్‌లను ఎలా బాధ్యులను చేస్తారు. తప్పులు చేస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ, పల్లె ప్రకృతివనాలకు స్థలాలను గుర్తించలేదని, వైకుంఠధామాలను నిర్మించలేదని వేటు వేయడం దారుణం. ఇలాంటి చర్యలతో సర్పంచ్‌లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే పనిభారంతో కార్యదర్శులు ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. 
– చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు