Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం

17 Sep, 2022 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్‌–హైదరాబాద్‌ రహదారి మీదుగా వస్తున్న మేజర్‌ జనరల్‌ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్‌కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు.

వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. 

ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్‌ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్‌ జనరల్‌ ఎడ్రూస్‌ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్‌ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు.  

20 మంది భారత సైనికులు మృతి  
హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్‌ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి:  అణచివేతపై సాయుధ పోరాటం!

కృత్రిమ వరదలకు కుట్ర  
భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్‌ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి.  (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్‌ పటేల్‌)

మరిన్ని వార్తలు