జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్‌ పటేల్‌ 

17 Sep, 2022 14:07 IST|Sakshi
మహమ్మద్‌ అలీ జిన్నా (ఫైల్)

సాక్షి, హైదరాబాద్‌:  ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్‌ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్‌ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్‌ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్‌ జాతిపిత మహమ్మద్‌ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్‌లో ఉన్న సర్దార్‌ పటేల్‌.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. 

లొంగిపోవాలా.. ఎదిరించాలా? 
భారత ప్రభుత్వం తరఫున మేజర్‌ జనరల్‌గా ఉన్న మున్షీ హైదరాబాద్‌కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్‌ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు.

హైదరాబాద్‌ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. 

కీసర సరిహద్దులో భీకర దాడితో.. 
నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్‌పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్‌పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్‌ను కోరాడు. పాకిస్తాన్‌ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!)

అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు
ఆస్ట్రియా వ్యాపారి కాటన్‌ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్‌ ఎయిర్‌పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్‌లో ఆయుధాలను అన్‌లోడ్‌ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్‌ బదులు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్‌ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్‌ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్‌ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్‌’గా.. వారియర్‌గా!)

>
మరిన్ని వార్తలు