Telangana Liberation Day 2022: నిజాం పునాదులు కదిలించిన ఓరుగల్లు

16 Sep, 2022 18:40 IST|Sakshi

తొలి రాజకీయ హత్య మొగిలయ్యదే..

చరిత్రకెక్కని పెరుమాళ్ల సంకీస, తమ్మడపల్లి(జి) ఘటనలు

మూకుమ్మడిగా సజీవ దహనాలు చేసిన రజాకార్లు

అయినా ఎదురొడ్డి పోరాడిన యోధులు

రావిచెట్టు సాక్షిగా విస్నూరు దొర కొడుకు బాబు హత్య

నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ఉద్యమకారులు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా ఊర్లకు ఊర్లు మర్లబడ్డయి. గ్రామస్తులు బరిసెలు, తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటానికి దిగారు. వీరిని చంపేందుకు రజాకార్లు చేయని ప్రయత్నం లేదు. నిజాం సైన్యం ఊర్లపై పడి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. గ్రామాల్లో మూకుమ్మడి హత్యలు చేశారు. అయినా వెరవలేదు. భయపడలేదు. ఎదురొడ్డి నిలిచి పోరాడారు. 

సింహంలా దూకిన మొగిలయ్య
హన్మకొండ కల్చరల్‌/వరంగల్‌ అర్బన్‌: 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించారు. ప్రతివారం వరంగల్‌ కోటలో, స్తంభంపల్లిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, ఏ.సుదర్శన్, బి. రంగనాయకులు, వి.గోవిందరావు, భూపతి కృష్ణమూర్తి, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్యల ఆధ్వర్యంలో 1944 నుంచి జెండా వందనాలు జరుగుతూ వచ్చాయి. బత్తిని రామస్వామి ఇంటిముందున్న ఆవరణలో 1946, ఆగస్టు 11న జెండావందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. 


విషయం తెలుసుకున్న రజాకార్ల గుంపు ఖాసీం షరీఫ్‌ ఆధ్వర్యంలో వారిపై దాడి జరిపారు. బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. వెంకటయ్య చేయి నరికివేశారు. కూచం మల్లేషం తుపాకీ గుండుతో గాయపడ్డాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటికే కల్లుగీసేందుకు వనానికి వెళ్లిన మొగిలయ్యకు తన సోదరుడు గాయపడిన సంగతి తెలిసింది. వెంటనే సింహంలా వచ్చి వారిపై కలబడ్డాడు. మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టాడని భావించిన రజాకార్లు బరిసెతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖాసీం షరీఫ్, తన అనుచరులు ఖిలా వరంగల్‌ నుంచి వరంగల్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలకు మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ భయం కలిగించేలా ఊరేగింపు చేశారు. మొగిలయ్య స్మారక చిహ్నంగా ఎల్లమ్మ బజారులో ఒక భవనాన్ని నిర్మించారు. అది ఇప్పటికి మొగిలయ్య హాలుగా ప్రసిద్ధి చెందింది. 


సగర్వంగా జీవిస్తున్నా..

నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ, కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులైన మా నాన్న గురించి పదే పదే చెప్పేవారు. రజాకార్లకు ఎదుదొడ్డి నిలిచి వీరమరణం పొందాడని చెబుతుండడం గర్వంగా ఉంటుంది. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ.. బత్తిని మొగిలయ్య గౌడ్‌ ట్రస్టునుంచి ఎలాంటి గుర్తింపు, ఆర్థికసాయం లేదు. 
– బత్తిని బాబు గౌడ్, మొగిలయ్య కుమారుడు

ఒంటిచేత్తో...
జాఫర్‌గఢ్‌ మండలం కూనూర్‌ గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్‌ అచ్చమాంబ ఒంటిచేత్తో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. తుపాకీ చేతపట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత ఆమె. గాయపడ్డ సహచర ఉద్యమకారులకు వైద్యం అందిస్తూ తనలోని గొప్పదనాన్ని చాటుకున్నారు. నెల్లుట్ల మోహన్‌రావుకు సహాయకురాలిగా పనిచేస్తూ.. ఆయననే వివాహం చేసుకున్నారు.


ఆ సమయంలో మోహన్‌రావు కమ్యూనిస్టు పార్టీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోహన్‌రావు మృతిచెందగా.. వృద్ధాప్యంలో ఉన్న సుశీలాదేవి మాత్రం ప్రస్తుతం వరంగల్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమరయోధుల పింఛన్‌ రానప్పటికీ, భర్తకు వచ్చే పింఛన్‌తో బతుకు బండి లాగిస్తున్నారు. (క్లిక్ చేయండి: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్‌)

గత చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్‌’
జనగామ: నిజాం నిరంకుశ పాలనపై మొదలైన తిరుగుబాటు.. దొరల పాలనకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్‌. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబుదొర అరాచకాలు ప్రజలను గోసపెట్టాయి. తనకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను హతమార్చాడు. 1947లో నలుగురు విప్లవకారులకాళ్లు, చేతులు కట్టేసి గూండాల సహాయంతో సవారు కచ్చరంలో లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. తెల్లవారుజామున ఊరి శివారున ఉన్న ఈత చెట్ల వనం సమీపంలో నలుగురిని సజీవ దహనం చేస్తున్న క్రమంలో.. ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు.


అదే మండలం కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు సుమారు పదివేల మందికిపైగా బాబుదొర జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. దీంతో అతను పోలీస్‌ శరణుకోరి తలదాచుకున్నాడు. తమ విముక్తి కోసం పోరాడుతున్న ముగ్గురు విప్లవకారులను చంపేశారనే ఆవేశంలో పోలీస్‌స్టేషన్‌ను సైతం బద్దలు కొట్టేందుకు యత్నించారు. దీంతో బాబుదొర గన్‌తో బెదిరిస్తూ.. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని పాత ఆంధ్రాబ్యాంకు ఏరియాలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న విప్లవయోధుడు గబ్బెట తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో జాటోతు దర్గ్యానాయక్‌ (ప్రస్తుతం బతికే ఉన్నారు).


మరికొందరు విప్లవకారులు జనగామ రైల్వే వ్యాగన్‌ ఏరియాలో కాపుకాస్తూ.. దొర రాకకోసం ఎదురుచూశారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్‌ రైలుకింద నుంచి దొర దాటుకుంటూ వ్యాగన్‌ పాయింగ్‌ రావిచెట్టు కిందకు రాగానే దర్గ్యానాయక్‌ ఆయన మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. దీంతో ప్రజల జయజయధ్వానాల మధ్య సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్‌ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

చరిత్రకెక్కని సంకీస పోరు; 21 మందిని సజీవ దహనం చేసిన రజాకార్లు
డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రజాకార్ల ఆగడాలకు 21 మంది గ్రామస్తులు బలి కాగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. కానీ.. ఆ పోరాటం చరిత్రకెక్కలేదు. మానుకోట, ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య, ఉయ్యాలవాడకు చెందిన ఏలూరి వీరయ్య,  నున్నా  పుల్లయ్య వేర్వేరుగా దళాలను ఏర్పాటు చేసి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు.


సంకీసకు చెందిన తుమ్మ శేషయ్య దళాలకు ముందుండి నడిపిస్తుండడంతో ఆయన్ను మట్టుబెట్టాలని రజాకార్లు పలుమార్లు ప్రయత్నించారు. శేషయ్యను పట్టుకునేందుకు ప్రయత్నించి మూడుసార్లు గ్రామాన్ని తగులబెట్టారు. నాలుగోసారి 1948, సెప్టెంబర్‌ 1న రజాకార్లు గ్రామంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు. శేషయ్య ఆచూకీ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులందరినీ బందెలదొడ్డి వద్దకు చేర్చారు. 15 ఏళ్లలోపు వారిని బయటకు పంపి.. మిగతా వారిని చిత్రహింసలకు గురిచేశారు. శేషయ్య జాడ చెప్పకపోవడంతో గ్రామస్తులపై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు.

కాల్పుల్లో కొందరు చనిపోగా.. కొన ఊపిరితో మరికొందరు కొట్టుకుంటుండగా వరిగడ్డి వారిపై వేసి కాల్చారు. వరి గడ్డి కోసం గడ్డివాము వద్దకు వెళ్లిన రజాకార్లకు గడ్డివాములో దాక్కున్న అన్నాతమ్ములు తేరాల గురవయ్య, రామయ్య, లాలయ్య కనిపించారు. వారు ఎంత బతిమిలాడినా వినకుండా తుపాకులతో కాల్చి చంపి అందరినీ ఒకచోటకు చేర్చి గడ్డితో తగులబెట్టారు. కాల్పుల్లో 16 మంది చనిపోగా.. తరువాత గాయాలతో ఐదుగురు ప్రాణాలు వదిలారు. రజాకార్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తరువాత సగం కాలిన మృతదేహాలకు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దే సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. నాటి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారిలో కొద్దిమంది మాత్రమే గ్రామంలో ఉన్నారు.


నెత్తురోడిన తమ్మడపల్లి(జి); ఒకేరోజు 12 మంది వీరమరణం

జనగామ/జఫర్‌గఢ్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌: తెలంగాణ సాయుధ పోరాటంలో జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(జి) ఊరి త్యాగం చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించదు. గ్రామానికి చెందిన 12 మందిని నిజాం సైన్యం కాల్చి చంపేసింది. నిజాం ఏజెంటుగా వ్యవహరించే ఖాదరెల్లి జాఫర్‌గఢ్‌ కేంద్రంగా తన అరాచకాలను కొనసాగించాడు. భరించలేని రైతులు ప్రజా రక్షక దళాలుగా ఏర్పడి కర్రలు, వడిశాలలు, బరిసెలు, కత్తులు, కారంపొడితో రజాకార్లపై తిరుగుబాటు చేశారు.


కమ్యూనిస్టు ప్రతినిధులు నల్ల నర్సింహులు, కృష్ణమూర్తి, యాదగిరిరావు, నెల్లుట్ల మోహన్‌రావు వీరికి అండగా నిలిచారు. 1947, సెప్టెంబర్‌ 11న జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానం స్ఫూర్తితో తమ్మడపల్లి(జి), సురారం, షాపల్లి, తిమ్మాపూర్‌తోపాటు అనేక గ్రామాల ప్రజలు ఖాదరెల్లి ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. విషయం తెలుసుకున్న రజాకార్లు తమ బలగాలతో తమ్మడపల్లి (జి) గ్రామాన్ని చుట్టుముట్టి 20 మందిని బంధించి, గ్రామ శివారులో వరుసగా నిలబెట్టి వారిపై బుల్లెట్ల వర్షం కురించారు.

ఈ ఘటనలో చాడ అనంతరెడ్డి, బత్తిని బక్క రాజయ్య, దొంతూరి చిన్న రాజయ్య, ఎరుకల ఇద్దయ్య, గుండెమల్ల పోశాలు, చెదలు నర్సయ్య, ఎండీ.ఖాసీం, గుజ్జరి రామయ్య, దిడ్డి పెరుమయ్య, కోమటి నర్సింహరామయ్య, కుంట పెద్దపురం, మంగలి వెంకటమల్లు, గుండెటి గుండారెడ్డి అసువులు బాయగా.. మరో 8 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్‌ 17.. అసలేం జరిగింది?)

మరిన్ని వార్తలు