మేకిన్‌ ఇండియా కాదు.. సేల్‌ ఇన్‌ ఇండియా 

3 Jan, 2022 02:16 IST|Sakshi

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానిది మేకిన్‌ ఇండియా కాదని, సేల్‌ ఇన్‌ ఇండియా పాలసీ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలతో కలిసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

‘సేవ్‌ పీఎస్‌యూ– సేవ్‌ ఇండియా’నినాదంతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్‌ హౌస్‌లో ప్రభుత్వరంగ సంస్థల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో వినోద్‌కుమార్‌ సమావేశమయ్యారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ట్రేడ్‌ యూనియన్స్‌ జేఏసీ ఏర్పా టుకు నిర్ణయం తీసుకున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, బీడీఎల్, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్, రైల్వే, హెచ్‌ఎంటీ – ప్రాగా టూల్స్, మిథాని, డీఆర్డీ ఎల్, ఈసీఐఎల్, మింట్, పోస్టల్, డీఎల్‌ఆర్‌ఎల్, పలు బ్యాంకుల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం నుంచే కేంద్రంపై  సమర శంఖారావాన్ని పూరిస్తున్నట్లు వినోద్‌ కుమార్‌ ప్రకటించారు.

ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం
‘కేంద్ర  సంస్థలను ప్రైవేటీకరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. ప్రభుత్వసంస్థలను ప్రైవేట్‌ పరం చేయడమంటే రిజర్వేషన్లు తొలగించడమే. ఈ సంస్థల్లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు లక్ష యాభై వేల మంది పని చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలతో పాటు దేశ రక్షణ శాఖను సైతం ప్రైవేట్‌కు అమ్మేందుకు ప్లాన్‌ చేస్తోంది. మిథాని, బీడీఎల్‌ సంస్థలను అమ్మేందుకూ సిద్ధమయ్యారు’అని వినోద్‌ అన్నారు.

మరిన్ని వార్తలు