7న రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎన్నిక

2 May, 2022 00:36 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 7న జరుగనుంది. అదేరోజున పాలకమండలి సభ్యులంతా హైదరాబాద్‌ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశమై అందులోని ఒక సభ్యుడిని చైర్మన్‌గా ఎన్నుకుం టారు. ఒకవేళ పోటీ అనివార్యమైతే మూజువాణీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే వక్ఫ్‌బోర్డు పాలకమండలికి ఆరుగురు సభ్యులు ఎన్నిక కాగా, తాజాగా మరో ముగ్గురు సభ్యులను నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ముస్లిం ప్రముఖుల కేటగిరీలో మహ్మద్‌ మసీఉల్లాఖాన్, షీయా స్కాలర్‌ కేటగిరీలో డాక్టర్‌ సయ్యద్‌ నీసార్‌ హుస్సేన్‌ ఆఘా, సున్నీ స్కాలర్‌ కేటగిరీలో మల్లిక్‌ మోహెతేశం, ప్రభుత్వ అధికారుల కేటగిరీలో షేక్‌ యాస్మీన్‌ బాషాలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ పేరు ప్రచారంలో ఉండగా తాజాగా మాజీ హజ్‌ కమిటీ చైర్మన్‌ మహ్మాద్‌ మసీఉల్లా పేరు తెరపైకి వచ్చింది.   

మరిన్ని వార్తలు