విపత్తులు, వరద కష్టాలపై ముందస్తు జాగ్రత్తలు

7 Jun, 2022 01:10 IST|Sakshi

కసరత్తు చేస్తున్న జలవనరుల శాఖ అధికారులు

సెంట్రల్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

ఈ నెల 16 నుంచి డిసెంబర్‌ 15 వరకు పర్యవేక్షణ 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే విపత్తులు, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. శాఖాపరంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సాగునీటి ప్రాజెక్టుల ఇన్‌చార్జిలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జూలై నుంచి వర్షాలు ప్రభావం చూపనున్న నేపథ్యంలో గతంలో జరిగిన నష్టాలు, వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అ«ధికారులను ఆదేశించింది.

ఈ మేరకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ జి.అనిల్‌కుమార్‌.. చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, ఇందిరమ్మ వరద కాల్వ సహా 11 ప్రాజెక్టుల నిర్వాహకులకు వివిధ జాగ్రత్తలపై సోమవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వరదల సందర్భంగా విపత్తు సంసిద్ధత, ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా కార్యాలయాల్లో సిబ్బంది 24 గంటలు పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. 

ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌లతో పర్యవేక్షణ: ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదు ర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెంట్రల్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ఈ నెల 16 నుంచి డిసెంబర్‌ 15 వరకు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలో సెలవు లేకుండా విధులు నిర్వహించాల్సి ఉన్నందున సిబ్బందికి కేటాయించిన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించనున్నారు. వరదలు ఉధృతంగా ఉంటే క్రమం తప్పకుండా పెట్రోలింగ్‌ నిర్వహించేందుకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాయింట్‌లు, రెగ్యులేటర్‌ గేట్లు, ప్రధాన, మధ్యస్థ ప్రాజెక్ట్‌ల కోసం వరద గేట్లు గుర్తించాలని ఆదేశాలు అందాయి. అన్ని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల వివరాలు అందుబాటులో ఉండాలని, వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని అధికారులకు సూచించారు. కంట్రోల్‌ రూమ్‌లు సమర్థవంతంగా పని చేసేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్‌లకు బాధ్యతలు అప్పగించారు.  

మరిన్ని వార్తలు