మహిళలకు అన్నివిధాలా అండగా..

28 Jun, 2021 08:21 IST|Sakshi
రాష్ట్ర మహిళా కమిషన్‌ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డికి మొక్కను బహుమతిగా అందిస్తున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో మంత్రి సత్యవతి రాథోడ్‌

మహిళా కమిషన్‌ రక్షణ, భరోసా కల్పించాలి: మంత్రి హరీశ్‌రావు  

మహిళా కమిషన్‌ నూతన కార్యాలయం ప్రారంభం

బన్సీలాల్‌పేట్‌ (హైదరాబాద్‌): తెలంగాణలో మహిళలకు అన్నివిధాలా ధైర్యాన్ని, రక్షణను, భరోసాను కల్పించే దిశగా రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్‌ బుద్ధభవన్‌లో ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ నూతన కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహిళలకు అన్ని విధాలా రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని, మహిళా సాధికారతకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో అనేక పథకాలు మహిళల సంక్షేమం కోసం ఇస్తున్నామంటూ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను వారి పేరిటే ఇస్తున్నామని, మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిం చామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒంటరి మహిళలను, బీడీ కార్మికులను ఆసరా పథకంలో చేర్చి పెన్షన్‌ ఇస్తున్నామని వివరించారు. షీటీమ్స్‌ మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. 

మహిళా చట్టాలపై అవగాహన 
రాష్ట్రంలో ప్రభుత్వం అనేక పథకాలను మహిళ పేరిట అమలు చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ అనేక సమస్యల నుంచి మహిళలకు విముక్తి కల్పించడంతోపాటు అన్ని విధాలా న్యాయం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల కోసం రూపొందించిన చట్టాలు పకడ్బందీగా అమలు జరిగేలా కమిషన్‌ పనిచేస్తోందన్నారు. మహిళా చట్టాలపై మహిళలతోపాటు పురుషులకు కూడా అవగాహన కల్పిస్తామని, జిల్లాల్లో పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కమిషన్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా, సత్య వతి రాథోడ్‌ కమిషన్‌ లోగోను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యతోపాటు కమిషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు