సీఎంఆర్‌ఎఫ్‌కు యువ రైతు విరాళం 

29 Jan, 2022 04:03 IST|Sakshi
సీఎం కేసీఆర్‌కు చెక్కు అందజేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం నీళ్లతో తన బీడు భూమిలో పంటలు పండించిన ఓ యువ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి పదివేల రూపాయలను విరాళంగా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి అనే యువ రైతు తన పంట ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏడాదిలో తాను పండించే రెండు పంటల నుంచే వచ్చే ఆదాయంలో ‘పంటకు పదివేల రూపాయల’లెక్కన ఆరునెలలకోసారి సీఎంఆర్‌ఎఫ్‌కు జమ చేయాలనే సంకల్పంతో శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.10 వేల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. ఏదో సంస్థలో అరకొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. తమ స్వంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల మధ్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుని తమ కాళ్లమీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. అతనికి నా అభినందనలు’అని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు