పోలీసులు ఫైన్లు వేస్తున్నారనే కోపంతో కాల్చేశాడు

9 Aug, 2021 09:45 IST|Sakshi

పెద్దేముల్‌: పోలీసులు ఫైన్‌ వేస్తున్నారని ఓ యువకుడు బైక్‌కు నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన పెద్దేముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్‌ గ్రామానికి చెందిన తలారి సంగప్పకు చెందిన బైకు (టీఎస్‌ 34డీ 2183)పై ఇప్పటివరకు పోలీసులు వివిధ ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కింద సుమారు రూ.5వేల వరకు ఫైన్‌ వేశారు. సదరు మొత్తం సంగప్ప ఇంతవరకు చెల్లించలేదు. 

తాజాగా ఆదివారం  గౌతాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద మరోమారు ఫైన్‌ వేస్తుండగా తప్పించుకున్న సంగప్ప మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం వెనకాల భాగంలో తన బైక్‌కు తానే నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్‌ఐ  కృష్ణకాంత్, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లేశం అక్కడికి చేరుకుని ఆరా తీశారు. బైక్‌ను ఎందుకు తగులబెట్టావని అడగ్గా ఇప్పటివరకు రూ.5వేలు ఫైన్‌ వేశారని వారి బాధను భరించలేక పెట్రోల్‌ పోసి నిప్పంటించానని సంగప్ప తెలిపాడు. పోలీసులు బైక్‌పై ఆన్‌లైన్‌లో పరిశీలించగా వివిధ ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కింద రూ.4,800 ఫైన్‌ వేసినట్టు తేలింది.  

మరిన్ని వార్తలు