గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గోస

10 Oct, 2022 01:58 IST|Sakshi
 దుబాయ్‌ ఎయిర్‌పోర్టు వద్ద తెలంగాణ యువకులు  

దుబాయ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ యువకులు

మూడు రోజులుగా ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు

ఇండియాకు రప్పించాలని మంత్రి కేటీఆర్‌కు వేడుకోలు

సిరిసిల్ల: గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో కొందరు తెలంగాణ యువకులు మోసపోయారు. దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో చిక్కిన యువకులు ఆదివారం తమ గోడును వీడియో ద్వారా మీడియాకు పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగులోత్‌ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన పెద్దోళ్ల స్వామి, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపెల్లి రాము, చందుర్తి మండలం ఎన్గల్‌కు చెందిన అనిల్, నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన నరేందర్‌లు ఐదు నెలల క్రితం కంపెనీ వీసాలపై దుబాయ్‌ వెళ్లారు.

గల్ఫ్‌ ఏజెంట్లు ఇండియాలో వీసాకు ఇంటర్వ్యూలు చేసినప్పుడు చెప్పిన పని కాకుండా.. వేరే లేబర్‌ పని చేయిస్తున్నారని, చెప్పిన విధంగా జీతం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై కంపెనీలో గొడవ జరిగిందని, ఇటీవల కంపెనీ హెచ్‌ఆర్‌ అధికారులు ‘మీరు క్యాంపు నుంచి వెళ్లిపోండి’అంటూ.. పాస్‌పోర్టులు ఇచ్చారని బాధితులు తెలిపారు.

పాస్‌పోర్టులు చేతికి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి విమాన టికెట్‌కు డబ్బులు తెప్పించుకున్నామని వివరించారు. స్వస్థలాలకు వచ్చేందుకు విమాన టికెట్లు కొనుక్కొని ఎయిర్‌ పోర్టుకు వస్తే.. బోర్డింగ్‌ అయిన తరువాత ఎయిర్‌ పోర్టు అధికారులు ‘మీ మీద కేసులు ఉన్నాయి.. మీరు తాగి క్యాంపులో గొడవ చేశారట.. వాటిని పరిష్కరించుకుని రావాలి’అని విమాన టికెట్లు చింపేసి, వెనక్కి పంపించారని వెల్లడించారు. తమ అందరి లగేజీ ఎయిర్‌ పోర్టులోనే ఉందని వాపోయారు.

మూడురోజులుగా ఎయిర్‌ పోర్టులోనే..
ఎయిర్‌ పోర్టులోనే మూడు రోజులుగా ఉంటున్నామని బాధి తులు తెలిపారు. అయితే ఎవరూ స్పందించడం లేదని, తిండి, నీళ్లు లేక ఎయిర్‌ పోర్టు పరిసరాల్లో కట్టుబట్టలతో గడుపు తున్నట్లు వివరించారు. పోలీసులు వస్తే.. పక్కకు తప్పుకుంటూ.. భయం భయంగా ఉంటున్నామని వాపోయారు.

మంత్రి కేటీఆర్‌కు వినతి
ఏజెంట్ల మాటలతో మోసపోయామని, తమను ఇండియాకు రప్పించేందుకు మంత్రి కేటీఆర్‌ సహకరించాలని వీర్నపల్లికి చెందిన యువకుడు అరవింద్‌ వీడియోలో కోరారు. దయచేసి తమను ఇంటికి చేరేలా చూడాలని, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామని బాధితులు మంత్రిని వేడుకున్నారు. దుబాయ్‌లో చిక్కిన తెలంగాణ యువకుల గోడు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు