నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా!

3 Oct, 2021 08:58 IST|Sakshi

సాక్షి ,సిరిసిల్లకల్చరల్‌( కరీంనగర్‌): కాలం మారుతోంది. ఉద్యోగాల్లో కొరవడిన స్థిరత్వం.. ఆశించిన మేర లభించని వేతనం. కరోనా లాంటి విపత్తులు.. యువతరం ఆలోచన సరళిలో మార్పు తెస్తున్నాయి. అర్హతకు తగిన ఉద్యోగం కన్నా అభిరుచికి అనుగుణమైన రంగంలో అధికంగా రాణించగలం అనేది యువత దృక్పథం. దీనికి అనుగుణంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలువురు యువకులు బీటెక్, ఎంఎస్, ఎంబీఏ లాంటి ఉన్నత విద్యార్హతలు సంపాదించుకుని కూడా సొంతకాళ్లమీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు.

సమాజంలో స్థిరపడేందుకు ఉద్యోగం ఒక్కటే పరిష్కారం అనే సంప్రదాయానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్నారు. తమ అభిరుచి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభిన్న వ్యాపార మార్గాలను ఎంచుకున్నారు. అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి గోపాల్‌నగర్‌ వెళ్లే దారిలో ఇటీవల ప్రారంభమైన పలు వాణిజ్య సంస్థలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. వారి స్వయంకృషి గురించి ఆ యువత మాటల్లోనే.. 

ఓపెనింగ్స్‌ బాగున్నాయి
హైదరాబాద్‌ అరోరా కాలేజీలో డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేశాను. పీజీలో ఉండగానే అక్కడే చిన్న వ్యాపారం ప్రారంభించాను. దురదృష్టవశాత్తు కరోనా కారణంగా అది దెబ్బతింది. ఆ కసితోనే ఉన్న వూళ్లో పిజ్జా సెంటర్‌ ప్రారంభించాను. మా బంధువులకు సిద్దిపేట, కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఇదే తరహా వ్యాపారాలు ఉండడంతో తొందరగానే వ్యాపార మెలకువలు నేర్చుకున్నాను. ఓపెనింగ్స్‌ బాగున్నాయి. రోజుకు కనీసం వందకు తగ్గకుండా కస్టమర్లు వస్తున్నారు. 
– తీగల సాయినాథ్‌గౌడ్, ఎంబీఏ, మాస్టర్‌ పిజ్జా సెంటర్‌

వ్యాపారమే నయం
హైదరాబాద్‌ సెయింట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ మెకానికల్‌ చేశాను. రెండేళ్లపాటు ప్రైవేట్‌ ఉద్యోగం చేశాను. సంతృప్తినివ్వలేకపోయింది. మూడేళ్ల క్రితం ఈ కేఫ్‌ కార్నర్‌ మరో కజిన్‌తో కలసి స్టార్ట్‌ చేశాం. తను ఇప్పుడు మరో వ్యాపారంలో స్థిరపడడంతో నేనే నడుపుతున్నాను. ఉద్యోగం కన్నా వ్యాపారమే నయం అనిపిస్తోంది. ఖర్చులన్నీ పోయినా నేను ఆశించినంతగా వస్తోంది. ఇప్పుడు అంతా హ్యాపీనే. – మచ్చ ఉదయ్, కేఫ్‌ కార్నర్‌ గోపాల్‌నగర్‌

నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకుని
హైదరాబాద్‌ తీగల కృష్టారెడ్డి కాలేజ్‌లో బీటెక్‌ పూర్తయ్యాక ఎంఎస్‌ కంప్యూటర్స్‌ కోసం యుఎస్‌ వెళ్లాను. ఏడాదిన్నర కోర్సు అయ్యాక ఐదున్నర సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. ఐడెంటిటీ కోసం అమెరికా వెళ్లాను కానీ నాకు ఇండియాలోనే ఇంటికి చేరువగా ఉండాలని ఉండేది. అందుకే ఐఐటీ చదువుకున్న స్నేహితుడితో పాటు మరో మిత్రుడితో కలిసి కేక్‌ హౌజ్‌ ప్రారంభించాను. వెరైటీ ఫ్లేవర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాం. సొంతంగా వ్యాపారం ఆనందంగా ఉంది. 
– గోవిందు సుమన్, ఎంఎస్‌ (యుఎస్‌)

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాను. హైదరాబాద్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశాను. ఉద్యోగంలో కోరుకున్నంత పురోగతి ఉండదని తొందరలోనే గుర్తించాను. సొంతంగా వ్యాపారం చేద్దామనుకుని స్నేహితులను సంప్రదించాను. మా కజిన్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ఐస్‌ హౌజ్‌ను ప్రారంభించాను. వైవిధ్యమైన ఐస్‌క్రీములని పరిచయం చేయడం ద్వార ప్రజలకు చేరువయ్యాం. మొదట్లో స్పందన తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా కస్టమర్లు పెరిగారు. రోజుకో 150 మంది వస్తుంటారు. స్నేహితులకు కూడా స్థిరపడగలమనే విశ్వాసం పెరిగింది.
– ఒడ్డెపెల్లి ప్రసాద్, ఐస్‌హౌస్‌ నిర్వాహకుడు 

చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’

మరిన్ని వార్తలు