దొంగెవరో దొరెవరో సీబీఐ తేల్చాలి

28 Oct, 2022 02:35 IST|Sakshi
వైఎస్సార్‌ విగ్రహం ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న వై.ఎస్‌. షర్మిల  

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ 

దస్తురాబాద్‌/కడెం: తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టేలా నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అమ్మాలన్నది ఎవరో, కొనాలన్నది ఎవరో సీబీఐ విచారణ చేసి తేల్చాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. పాదయా త్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా ఖానా పూర్‌లో గురువారం మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని స్పష్టం చేశారు.

ఈ విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం మానుకుని విచారణకు సిద్ధం కావాలని సూచించారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటికి 2800 కిలోమీటర్లు దాటింది. ఈ సందర్భంగా లింగాపూర్‌ గ్రామంలో దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. రాజన్న బిడ్డగా తనను ఆదరిస్తే తెలంగాణలో వైఎస్సార్‌ పాలన తీసుకువస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు