Campus Interview: క్యాంపస్‌లోనే కొట్టేశారు

20 Jul, 2021 01:26 IST|Sakshi

కాలేజీ సెలెక్షన్స్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు

ప్రభుత్వ కాలేజీల్లో 46 శాతం... ప్రైవేట్‌లో 53 శాతం

2018–19 గణాంకాల స్పష్టీకరణ

అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే పెరిగిన అవకాశాలు

కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఇంజనీరింగ్‌ చేసిన వారికి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో లభించాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యా సంస్థల్లో చదివినవారికి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలో ఏఐసీటీఈ అనుబంధ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2018–19 సంవత్సరంలో 1.03 లక్షల మంది చదవగా, అందులో 46.09 శాతం మంది క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందినట్లు కేంద్రం తెలిపింది.

అలాగే ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అదే ఏడాది 7.01 లక్షల మంది చదవగా, 53.52 శాతం మంది ఉద్యోగాలు పొంది నట్లు పేర్కొంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు కాకుండా ఇతర పద్ధతుల్లోనూ ఉద్యోగావకాశాలు వస్తున్నాయని వివరించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందినవారి శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.

వడబోత తర్వాతే నియామకాలు
స్వదేశీ, విదేశీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లను వెతికి పట్టుకొని ఉద్యోగాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఇచ్చే ర్యాంకుల ఆధారంగా కంపెనీలు కాలేజీలను ఎంపిక చేసుకుని క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటర్వ్యూలు నిర్వహించేప్పుడు కంపెనీలు వివిధ దశలుగా వడబోత కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రతిభ కనబర్చే వారికే అవకాశాలు దక్కుతున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు. ఏ దశలో వెనుకబడినా అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు.

క్యాంపస్‌ ఇంటర్వ్యూలతోపాటు తమ కంపెనీల వద్దకే కాలేజీ విద్యార్థులను పిలిపించుకొని, ఉద్యోగాల కోసం వారిని వివిధ పద్ధతుల్లో పరీక్షిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో చదువులపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము కోసమే పనిచేసే కొన్ని కాలేజీల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి మాత్రం నిరాశాజనకంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు కరోనా కాలంలో ఉద్యోగావకాశాలు తగ్గినట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో చివరి రెండేళ్లు చదివిన విద్యార్థులు క్లాసులు లేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేకపోయారని అంటున్నారు. ఈ పరిస్థితి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బ తీసిందని వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు