మాటకు కట్టుబడి.. ఇళ్లు కట్టించి..

15 Feb, 2022 02:23 IST|Sakshi
చిన్నారికి భక్ష్యం వడ్డిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

కేసీఆర్‌ ఏ పనైనా జిద్దుగా చేస్తారు: కేటీఆర్‌

సిరిసిల్ల: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. పేదోళ్లందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని కొద్దిగా వెనుకా.. ముందు అందరికీ ఇళ్లు వస్తాయని భరోసా ఇచ్చారు. పేదలకు మాట ఇస్తే సీఎం నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. పనీపాట లేక కొందరు విమర్శలు చేస్తున్నారని.. వారికి దమ్ము ధైర్యం ఉంటే దేశంలో ఎక్కడైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇచ్చిందో చూపెట్టాలని సవాల్‌ విసిరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు.    

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 2.80 లక్షల డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను రూ.18 వేల కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చే ఒక్క అర్ర ఇల్లుకోసం కూడా చేయి తడపాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే చెంప మీద కొట్టండి.’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏదైనా పట్టుబడితే ఆ పని అయ్యే వరకు సీఎం కేసీఆర్‌ వదలిపెట్టరని, ఆయన జిద్దు మనిషని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 270 కోట్ల మొక్కలు నాటించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల మంది రైతులకు రూ.52వేల కోట్లు రైతుబంధు కింద జమ చేశారని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకంలో రూ.8,500 కోట్లు పంపిణీ చేశారని, 11 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు ఇచ్చారని వివరించారు.

మరిన్ని వార్తలు