వరద జలాలతో అనుమతి రాదనే నికర జలాలతోనే 

20 May, 2023 04:35 IST|Sakshi

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టాం 

కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ వాదనలు 

తదుపరి వాదనలు జూలై 12 నుంచి 

సాక్షి, హైదరాబాద్‌: వరద జలాలపై ప్రతిపాదిస్తే ప్రాజెక్టుకు అనుమతి రాదనే, నికర జలాలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్టు తెలంగాణ గుర్తు చేసింది. పాత ప్రతిపాదన(జూరాల)కు కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టుకు మధ్య నీటిని ఎత్తిపోసే ప్రదేశం ఒకటే మారిందని, డిజైన్‌లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేసింది.

శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కృష్ణా జల వివాదాలకు సంబంధించి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో తెలంగాణ, ఏపీ వాదనలు వినిపించాయి. 2015లో జీవోనెం 105 ప్రకారం పాలమూరు–రంగారెడ్డిని వరద నీటితో చేపట్టిన ప్రాజెక్టుగా, 2022లో జీవోనెం.216 ప్రకారం నికర జలాలతో చేపట్టినట్లు చూపారని తెలంగాణను ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ప్రశ్నించారు.

అంతకు ముందు జూరాల నుంచి, ఇప్పుడు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి చేపట్టడాన్ని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ తరపు న్యాయవాది స్పందిస్తూ వరద నీటితో అనుమతులు రావనే నికర జలాలు కేటాయింపుతో చేపట్టినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కరించే బాధ్యతను అపెక్స్‌ కౌన్సిల్‌కు అప్పగిస్తే అందుకు విరుద్ధంగా ట్రిబ్యునల్‌లో కేసు వేసిందని గుర్తుచేశారు. 

ఆ అధికారం అపెక్స్‌కు లేదంటూ ఏపీ వాదనలు 
నీటి పంపకాలు చేసే బాధ్యత అపెక్స్‌ కౌన్సిల్‌కు లేదని, ఒక్క. ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ వాదించింది. ఉమ్మడి ఏపీలోనే 2013 లోనే పాలమూరు ప్రాజెక్టును ప్రతిపాదించారని, తెలంగాణ ఏర్పడ్డాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని తెలంగాణ గుర్తు చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ గంపగుత్తగా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇందులో ఏపీ 300 టీఎంసీలను బేసిన్‌ అవతలికి తరలిస్తోందని, బేసిన్‌ పారామీటర్‌ ప్రకారం 811 టీఎంసీల్లో 70 శాతం నీటిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది.

దీనిపై ట్రిబ్యునల్‌ చైర్మన్‌ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌–89 ప్రకారం ప్రకారం కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచే అధికారం లేదని గుర్తు చేశారు. మరోవైపు ఏపీ వేసిన అఫిడవిట్‌పై తెలంగాణ వాదనలు వినిపించడానికి వీలుగా ట్రిబ్యునల్‌ విచారణను జూలై 12కు వాయిదా వేశారు. జూలై 12, 13, 14వ తేదీల్లో తెలంగాణ ఏపీ వేసిన అఫిడవిట్‌పై వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు