తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు

10 Aug, 2020 18:11 IST|Sakshi

వచ్చే నెల 9 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌

ఈనెల 31న ఈసెట్, సెప్టెంబరు 2న పాలీసెట్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది. ఈ నెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింతగ్‌ పరీక్షలను నిర్వహించనుంది. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది.

అలాగే అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్‌ తదితర సెట్స్‌ తేదీలను పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయాలను హైకోర్టుకు తెలియజేసి, కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇక రాష్ట్రంలో ప‍్రవేశ పరీక్షలు, ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

మరిన్ని వార్తలు