JEE Main Results 2022: జేఈఈ మెయిన్‌ తొలి విడత.. మనోళ్లే టాపర్లు

12 Jul, 2022 01:10 IST|Sakshi

తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ముగ్గురికి టాప్‌ పర్సంటైల్‌ 

ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కోటాలోనూ హవా

దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి నూటికి నూరు ఎన్‌టీఏ స్కోర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు సహా ఇతర జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు జరిగిన జేఈఈ మెయిన్‌– 2022 మొదటి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు టాపర్ల జాబితాలో నిలిచారు. రాష్ట్రానికి చెందిన జాస్తి యశ్వంత్‌ వీవీఎస్, అనికెత్‌ చటోపాధ్యాయ, ధీరజ్‌ కురుకుండ, రూపేష్‌ బియానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొయ్యన సుహాస్, పెనికలపాటి రవికిషోర్, పోలిశెట్టి కార్తికేయ నూటికి నూరు ఎన్‌టీఏ స్కోర్‌ సాధించారు. హరియాణా, జార్ఖండ్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, కర్ణాటక, యూపీకి చెందిన ఒక్కో విద్యార్థి కూడా టాపర్లు గా ఎంపికయ్యారు. మొత్తం 14 మంది విద్యార్థులు టాప్‌ స్కోర్‌ సాధించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది.

అన్ని కేటగిరీల్లోనూ...
అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. జనరల్‌ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఏపీ విద్యార్థి పి.రవి కిషోర్‌ టాపర్‌గా నిలవగా ఎస్సీ విభాగంలో ఏపీ విద్యార్థి డి. జాన్‌ జోసెఫ్‌ 99.99 పర్సంటైల్‌తో మొదటి స్థానంలో సాధించాడు. ఓబీసీ కోటాలో 99.99 పర్సంటైల్‌తో ఏపీ విద్యార్థి సనపాల జస్వంత్‌ ఐదవ స్థానంలో నిలిచాడు. అలాగే అమ్మాయిల విభాగంలో ఏపీ విద్యార్థినులు టాప్‌–10లో 5 స్థానాలు సాధించారు.

పేపర్‌ కఠినంగా ఉన్నా...
జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జూన్‌ 24 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 588 కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షకు 8,72,432 మంది దరఖాస్తు చేసుకోగా 7.69 లక్షల మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లపాటు నాలుగు విడతలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ను ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో రెండు విడతలుగా జరుగుతోంది.

తొలి విడత ఫలితాలు విడుదలవగా రెండో విడత పరీక్ష ఈ నెల 24 నుంచి 30 వరకు జరగనుంది. గత రెండేళ్లుగా సరైన తర్ఫీదు లేకపోవడం, రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు సిలబస్‌ను 70 శాతానికి కుదించినా, ఎన్‌టీఏ మాత్రం ఈ వెసులుబాటు ఇవ్వకపోవడంతో ఈసారి పరీక్ష కొంత కఠినంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తొలి విడతలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని గణితశాస్త్ర నిపుణుడు ఎంఎన్‌ రావు తెలిపారు. తొలి విడత మెయిన్స్‌ రాయలేకపోయిన వారు లేదా తొలి విడతలో వచ్చిన తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలనుకొనే విద్యార్థులు రెండో విడత జేఈఈ మెయిన్స్‌ రాసుకోవచ్చు. రెండు విడతల పరీక్ష పూర్తయ్యాకే ఎన్‌టీఏ ర్యాంకులు విడుదల చేయనుంది.

సత్తా చాటిన ఎస్సీ, బీసీ గురుకుల విద్యార్థులు...
జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత ఫిలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. మొత్తం 581 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ రాయగా వారిలో 35 మంది విద్యార్థులు 90 పర్సంటైల్‌ సాధించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెజారిటీ విద్యార్థులకు 40 కంటే ఎక్కువ పర్సంటైల్‌ వచ్చిందన్నారు.

మరోవైపు మొత్తం 60 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 23 మంది అర్హులయ్యారు. భరత్‌కుమార్‌ అనే విద్యార్థి 92.01 పర్సంటైల్‌ సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపకులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. కాగా, జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్‌కు చెందిన గజవాడ శ్రీనివాస్‌–శ్రీదేవి దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడైన భరత్‌ 99.764 పర్సంటైల్‌ సాధించాడు.

ఎన్‌టీఏ స్కోర్‌ అంటే...
ఈ పరీక్షలో విద్యార్థులకు ప్రకటించిన ఎన్‌టీఏ స్కోర్, వారికి వచ్చిన మార్కుల శాతం రెండూ ఒకటి కావని ఓ ఎన్‌టీఏ ఉన్నతాధికారి తెలిపారు. ఒక విడతలో పరీక్ష రాసిన విద్యార్థులందరి సాపేక్ష ప్రతిభా ప్రదర్శన ఆధారంగా స్కోర్‌ కేటాయిస్తామని... ఇందుకోసం విద్యార్థులు సాధించే మార్కులను 100 నుంచి 0 మధ్య ఉండే స్కేల్‌కు అనుగుణంగా మారుస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు