వణుకుతున్న తెలంగాణ.. ఈ సీజన్‌లోనే అత్యల్పం నమోదైంది అక్కడే..

22 Dec, 2021 03:34 IST|Sakshi
తిర్యాణి మండలం భీమారంలో ప్రభుత్వ బడిలో చలి నుంచి రక్షణకు ఎండలో పాఠాలు  

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో సాయంత్రం ఆరేడు గంటల నుంచే చలి ప్రభావం చూపిస్తోంది. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు మూడు డిగ్రీలు తగ్గిపోవడం చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది.

సోమవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యూ)లో 6 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం ఇదే జిల్లాలోని గిన్నెదరిలో 3.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యింది. సిర్పూరు(యూ)లో 3.8 నమోదు కాగా ఆదిలాబాద్‌ జిల్లా బేలాలో కూడా 3.8, అర్లి(టీ)లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

దీనికి ముందు 2015 జనవరి 10న సంగారెడ్డిలోని కోహిర్‌లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. అంతకుముందు 2014 డిసెంబర్‌ 18న కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో అత్యవసరం అయితే తప్ప రాత్రి, ఉదయం పూట ప్రజలు బయటికి రావడం లేదు.

తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం రోజుల పాటు గణనీ యంగా పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతా వరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొ న్నారు. బుధవారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో సాధా రణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశముందని నాగరత్న తెలిపారు. 

ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం 
చలికాలంలో చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కన బడుతుంటాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు  ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదముంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుం టాయి. కాబట్టి ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్‌ వాడాలి.

వాహ నదారులు స్వెటర్లు, సాక్స్, గ్లౌజ్‌లు వాడాలి. వేపుడు పదార్థాలు, మసాలాలు కాకుండా పోష కాలు ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. ఆహారం కూడా వేడివేడిగా తీసుకోవాలి.

అస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం చలిగాలిలో వాకింగ్‌ చేయకూడదు. ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదు. వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. 
–డాక్టర్‌ హెఫ్సిబా, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు