3 పెద్దాసుపత్రుల టెండర్లు ఖరారు 

6 Dec, 2022 03:27 IST|Sakshi

కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా, ఎల్‌అండ్‌టీ, డీఈసీ 

రూ. వెయ్యి కోట్ల చొప్పున అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 

ఏడాదిన్నరలోగా పూర్తి చేసేలా సర్కారు లక్ష్యం  

ఆసుపత్రుల డిజైన్లపై సీఎం అసంతృప్తి.. మార్చాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో రూ. వెయ్యి కోట్ల చొప్పున నిర్మించబోయే మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సోమవారం టెండర్లు ఖరారయ్యాయి. ఎల్బీ నగర్‌ సమీపంలోని గడ్డిఅన్నారం మార్కెట్‌ ప్రాంతంలో, సనత్‌నగర్‌లోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో, అల్వాల్‌ వద్ద నిర్మించబోయే ఈ మూడు ఆసుపత్రుల టెండర్లను మేఘా, ఎల్‌అండ్‌టీ, డీఈసీ వంటి ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ ఆసుపత్రుల డిజైన్‌పై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో వాటిని తిరిగి డిజైన్‌ చేసే పనిలో ఉన్నట్లు తెలిపాయి. వైద్య, ఆరోగ్యశాఖ మార్గనిర్దేశంలో రోడ్లు, భవనాలశాఖ సహకారంతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెండర్లు ఖరారైనందున డిజైన్‌పై తుది నిర్ణయం తీసుకున్నాక ఆసుపత్రుల నిర్మాణం మొదలవనుంది.

అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. హెలికాప్టర్‌ కూడా దిగేలా ఆసుపత్రులను తీర్చిదిద్దే అవకాశముంది. అవయవ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయాల్సిన సందర్భాల్లో అవయవాలను తరలించేందుకు వీలుగా లేదా రోగులను అత్యవసరంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు హెలికాప్టర్‌ సేవలను ఈ ఆస్పత్రుల నుంచి వినియోగించేలా వాటిని నిర్మించనున్నారు. 

వెయ్యి పడకలతో... 
ఇప్పటివరకు కార్పొరేట్‌ ఆస్పత్రుల కారణంగా హెల్త్‌ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌... రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలోనూ పేదలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా ఆ ఘనతను సాధించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్కో స్పెషాలిటీ వైద్యాన్ని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనుంది.

ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కనీసం 30 మంది నిష్ణాతులైన డాక్టర్లను నియమించనుంది. వీటిల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడానికి వీలుండదు. అంతేకాదు ఈ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు, 200 ఐసీయూ పడకలు ఉంటాయి. వీటిల్లో పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులూ అందుబాటులోకి తెస్తారు. ఏడాదిన్నరలోగా పూర్తిచేయాలన్నది సర్కారు సంకల్పం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవసరమైన క్వార్టర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ బ్లూప్రింట్‌ తయారు చేసింది.   

మరిన్ని వార్తలు