BJP MLA Raja Singh: అరెస్ట్‌.. టెన్షన్‌

26 Aug, 2022 08:59 IST|Sakshi
సందడి లేని చార్‌కమాన్‌ చార్మినార్‌ రోడ్డు

సాక్షి, హైదరాబాద్‌ /చార్మినార్‌/అబిడ్స్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గురువారం మరోసారి అరెస్ట్‌ చేయడంతో ధూల్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం వెస్ట్‌జోన్‌ పోలీసులతో పాటు టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజాసింగ్‌ ఇంటి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజాసింగ్‌ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయనను అరెస్ట్‌ చేశారు. ధూల్‌పేటతో పాటు గోషామహల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  


                                    చార్మినార్‌ వద్ద బలగాల పహారా

రాజాసింగ్‌ అరెస్టుకు నిరసనగా వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి దుకాణాలను మూసివేయించగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మూసివేశారు. ఫీల్‌ఖానా, బేగంబజార్, కోల్సివాడి, ఛత్రి, మిట్టికాషేర్, సిద్దిఅంబర్‌ బజార్, బర్తన్‌బజార్‌ ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. 

రాజాసింగ్‌ అరెస్టుతో ఎంజే మార్కెట్‌ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్‌ అభిమానులు దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్, టీఆర్‌ఎస్‌లు కక్షతోనే ఎమ్మెల్యేని అరెస్ట్‌ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బేగంబజార్, జాంబాగ్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, చుడీబజార్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాజాసింగ్‌ అరెస్టుపై చర్చించుకోవడం కనిపించింది.


                        కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రాజాసింగ్‌ అభిమానులు  

ఈ రోజు గడిస్తే చాలు! 
శుక్రవారం.. సాధారణ పరిస్థితుల్లోనే నగర పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాంటిది ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం పాతబస్తీలోనే కాకుండా నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరం సోమవారం రాత్రి నుంచి అట్టుడుకుతోంది. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకూడదని నిర్ణయించారు. దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాల్లోని పోలీసు స్టేషన్ల పరిధితో పాటు మిగిలిన చోట్లా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.  


                         బేగం బజార్‌లో భారీగా మోహరించిన పోలీసులు

స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు.. 

  • బారికేడ్లు, సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద ఉన్న సిబ్బందికి తోడు అత్యవసర సమయాల్లో వి«నియోగించడానికి స్టైకింగ్‌ ఫోర్స్‌ టీమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలను కనిపెట్టి, వెంబడించడానికి మఫ్టీల్లో ఉండే షాడో పారీ్టలు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి నగరంలోని ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు.  
  • విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారుల వెంట కొన్ని రిజర్వ్‌ టీమ్స్‌ ఉంటాయి. ఇవి సదరు అధికారి వెంటే ఉంటూ అవసరమైన చోటకు వెళ్తాయి. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అణువణువు నిఘా ఉంచి, చిత్రీకరించడానికి వీడియో, డిజిటల్‌ కెమెరాలతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పీస్‌ కమిటీలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. 

అత్యంత అప్రమత్తంగా.. 

  • బందోబస్తు, భద్రత ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలోని ప్రాంతాలతో పాటు మిగిలిన చోట్లా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. దీనికి సంబంధించి కమిషనర్‌ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీవీ ఆనంద్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి నగర అధికారులతో పాటు బందోబస్తు కోసం జిల్లాలు, ఇతర విభాగాల నుంచి వచ్చిన అధికారులు హాజరయ్యారు. ఇందులో శుక్రవారం అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు.  
  • అత్యంత సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాలతో పాటు సోమవారం రాత్రి నుంచి నిరసనలు చోటు చేసుకున్న చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలు ఇతర వ్యవహారాలను పసిగట్టడానికి వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం కంట్రోల్‌ రూమ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు.   


                     రాజాసింగ్‌ అరెస్టును నిరశిస్తూ దుకాణాలు మూసివేత

బోసిపోయిన పాతబస్తీ:
పాతబస్తీలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం నుంచీ సాయంత్రం ఎలాంటి నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు జరగలేదు. శాలిబండ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మజ్లిస్‌ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రధాన రోడ్లపైకి వచ్చి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దక్షిణ మండలం పోలీసులు లాఠీ చార్జి చేశారు. విషయం తెలుసుకున్న శాలిబండ మజ్లిస్‌ కార్పొరేటర్‌ ముజఫర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. రెండు మూడు రోజులుగా పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్‌ వద్ద సందర్శకుల సందడి తగ్గింది.

చిరు వ్యాపారాలు వెలవెలబోయాయి. నయాపూల్, మదీనా, మీరాలంమండి, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, లాడ్‌బజార్‌ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  పాతబస్తీలో ఎలాంటి నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు.

ప్రాంతాలను బట్టి ఏర్పాట్లు..  

  • నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బందోబస్తులో ప్రాంతాల స్థితిగతులను బట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు, ఉద్రేకాలకు తావు లేని చోట్ల సాధారణ స్థాయి పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, సోదాలు, నాకాబందీలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి.  
  • సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా గల్లీలు, మారుమూల ప్రాంతాల్లోనూ చేపట్టాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి, గురువారం తెల్లవారుజామున సైతం పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. రాజేష్‌ మెడికల్‌ హాల్‌ వద్ద పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలిపెట్టారు. బుధవారం మొఘల్‌పురా వద్ద పోలీసు వాహనం ధ్వంసానికి సంబంధించి స్థానిక ఠాణాలో కేసు నమోదైంది.   

(చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?)

మరిన్ని వార్తలు