Munugode By Election Results: టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ 

6 Nov, 2022 08:06 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.  రాష్ట్రంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఉప ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంతో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారోనన్న ఉత్కంఠ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎవరికి అనుకూలంగా, మరెవరికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న టెన్షన్‌ ప్రధాన పార్టీలకు తప్పడం లేదు. బరిలో ఉన్న 47 మంది అభ్యర్థులు, ఆయా పార్టీలు తీర్పు కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఆదివారం మధ్యాçహ్నం వరకు ఈ టెన్షన్‌ తప్పదు. 

ఏ పార్టీకి పట్టం కడతారో..
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మునుగుతుందో, ఏ పార్టీ తేలుతుందో ఆదివా రం వెల్లడికానుంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానం కావడంతో జోరుగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ ప్రచారం కొనసాగింది. మొదట్లో జోరుగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత కొంత నెమ్మదించింది. పోలింగ్‌ తేదీ దగ్గర పడిన సమయంలో మాత్రం మళ్లీ ప్రచార జోరును పెంచింది. అయితే టీఆర్‌ఎస్, బీజేపీ చేసినంత భారీ ఎత్తున ప్రచారం కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయింది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌..
టీఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా(బీఆర్‌ఎస్‌) మార్పు చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో దిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీఆర్‌ఎస్‌ పేరుతో ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఈ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు తమ పాత స్థానాన్ని కచ్చితంగా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఉప ఎన్నికల్లో ఇన్‌చార్జులుగా నియమించింది. వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గంలో జరిగిన రెండు సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు పెద్ద ఎత్తున రోడ్‌షోలు నిర్వహించారు. మంత్రులు ఆయా మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారం పని చేసింది. 

దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ
దక్షిణ తెలంగాణలో పాగా వేసే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డినే బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆయన గెలుపు ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. ఈ రెండు పార్టీల మధ్యే హోరా హోరీగా పోరు జరిగింది.

సిట్టింగ్‌ స్థానం కోసం కాంగ్రెస్‌
సిట్టింగ్‌ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ మొదట్లో సీరియస్‌గా తీసుకుంది. మొదట దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. తర్వాత మధ్యలో నెమ్మదించింది. భారత్‌ జోడో యాత్రకు రాష్ట్ర నాయకత్వం అంతా వెళ్లడంతో కొంత వెనుకబడింది. చివరలో మళ్లీ ప్రచార జోరును పెంచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

కౌటింగ్‌ ఇలా
► ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రాంరంభం
► 298 పోలింగ్‌ స్టేషన్లు
► 21 టేబుళ్లు, 15 రౌండ్లలో లెక్కింపు
►  294 పోలింగ్‌ స్టేషన్ల ఓట్లు 14 రౌండ్లలో లెక్కింపు
►  15వ రౌండ్‌లో 4 టేబుళ్లపై మిగిలిన 
► 4 పోలింగ్‌ స్టేషన్ల ఓట్ల లెక్కింపు 
►  9 గంటలకు మొదటి రౌండ్‌ ఫలితం 
►  చివరి ఫలితం ఒంటిగంట వరకు వచ్చే అవకాశం 
► విధుల్లో పాల్గొనే మొత్తం సిబ్బంది 250 మంది
►  అందులో కౌంటింగ్‌ కోసం 100 మంది, ఇతర కార్యకలాపాలకు 150 మంది
► ఒక్కో టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పోలింగ్‌ సూపర్‌వైజర్, ఒక పోలింగ్‌ అసిస్టెంట్‌ ఉంటారు. 
► అభ్యర్థుల ఏజెంట్లు  ఉండేలా ఏర్పాట్లు

పోలైన ఓట్లు ఇలా..
► నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855. ఇందులో 50 సర్వీసు ఓటర్లు. 
► ఈవీఎంలలో పోలైనవి 225192 ఓట్లు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు 739 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
►పోస్టల్‌ బ్యాలెట్‌లు, ఈవీఎంలలో మొత్తంగా 2,25,878 ఓట్లు పోలయ్యాయి. 93.41 శాతం పోలింగ్‌ నమోదైంది. 
► నవంబరు 4వ తేదీ నాటికి నాటికి సాయుధ బలగాలకు (సర్వీస్‌ ఓటర్స్‌) సంబంధించిన ఓట్లు 50 అందాయి.  

4 గంటల వరకు కౌంటింగ్‌ పూర్తి
కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అవసరమైన సిబ్బందిని నియమించాం. మొదటి రౌండ్‌లో చౌటుప్పల్, చివరి రౌండ్‌లో నాంపల్లి మండలాల కౌంటింగ్‌ ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్‌ పూర్తి కావచ్చు. ఈవీఎంల లెక్కింపు తరువాత డ్రా పద్ధతిన  5 పోలింగ్‌ స్టేషన్ల వీవీ ప్యాట్‌లను లెక్కిస్తాం.
– జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డి

పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం
ఆర్జాలబావిలోని గోదాముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. 470 మంది పోలీసులు, 3 కంపెనీల కేంద్ర బలగాలతో కౌంటింగ్‌ కేంద్రం వద్ద భద్రతా చర్యలు చేపట్టాం.
– ఎస్పీ రెమా రాజేశ్వరి

మరిన్ని వార్తలు