ఉద్రిక్తంగా ఉపాధ్యాయుల అసెంబ్లీ ముట్టడి 

14 Sep, 2022 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బదిలీలు, పదోన్నతుల షెడ్యూ­ల్‌ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఉపాధ్యాయుల అసెంబ్లీ ముట్టడి ప్రయత్నం ఉద్రిక్తతగా మారింది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ పిలుపు మేరకు మంగళవారం నలుమూలల నుంచి వందలాదిమంది ఉపాధ్యాయులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయల్దేరి నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్‌ మీదుగా అసెంబ్లీ ఎదురుగా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు.

పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్దకు చేరుకోగానే పోలీసులు బారికేడ్లతో నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. చలో అసెంబ్లీ ర్యాలీకి యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు జంగయ్య, అశోక్‌కుమార్, రఘుశంకర్‌రెడ్డి, రవీందర్, లింగారెడ్డి, కొండయ్య, జాదవ్‌ వెంకట్రావు, మేడి చరణ్‌దాస్, యాదగిరి, సయ్యద్‌ షౌకత్‌ అలీ, విజయకుమార్, చావ రవి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆందోళన ప్రభుత్వ బడులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమన్నారు. 

మరిన్ని వార్తలు