కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ గుబులు!

22 Nov, 2020 09:09 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: ఐపీఎల్‌ బెట్టింగ్ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. బెట్టింగ్‌ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. రెండు రోజుల నుంచి అతని ఇంట్లో సోదాలు చేస్తోంది. నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సీఐ సన్నిహితుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఇక  బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలను ఏసీబీ సేకరిస్తున్నట్టు సమాచారం. మామూళ్ల విషయంలో ఎస్సైలు, డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రతో పాటు కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. నిన్న రాత్రి నుంచి డీఎస్పీ కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. గత రాత్రి కామారెడ్డి డీఎస్పీని విచారించారు. ఇక మామూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్సైలలో ఒకరు సెలవులో ఉండగా.. మరొకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీస్‌ అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు తెలిపారు.
(చదవండి: బెయిల్‌ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం)

>
మరిన్ని వార్తలు