మే 17 నుంచి టెన్త్‌ పరీక్షలు!

22 Jan, 2021 03:24 IST|Sakshi

అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ

1–2 రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్ర!

సాక్షి, హైదరాబాద్‌: మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖరారు చేసింది. కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించ నుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్‌ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభు త్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తా వించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్‌లైన్‌/ డిజిటల్‌ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మొత్తం 204 పనిదినాలు
మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ పద్ధతిలో 115 రోజులు అవుతాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజుల పని దినాలు ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్‌లైన్‌/డిజిటల్‌ విద్యా బోధన కొనసాగుతుంది. ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి. 

ఉదయం 9.30 నుంచి బడి
పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. డిజిటల్‌ బోధన పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటుంది. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి. 70 శాతం సిలబస్‌నే టీచర్లు ప్రత్యక్ష బోధనతోపాటు, ఆన్‌లైన్‌/డిజిటల్‌ విధానంలో బోధిస్తారు. మిగతా 30 శాతం సిలబస్‌ ప్రాజెక్టు వర్క్స్, అసైన్‌మెంట్లకే ఉంటుంది. వాటిని ఇంటర్నల్‌ అసెస్‌మెంట్స్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌/బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు. 

ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు
ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు. ఇంటినుంచే చదువుకుంటామంటే తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి. కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి. ఏ ఒక్క విద్యార్థినీ ఏ కారణంతోనూ పరీక్షల నుంచి విత్‌హెల్డ్‌లో పెట్టడానికి వీల్లేదు.

విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక
– పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీతో సమావేశం నిర్వహించాలి. కోవిడ్‌ జాగ్రత్తలు, రోగనిరోధకత పెంపు, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
– విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి ఐసోలేషన్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేందుకు రవాణా సదుపాయం కల్పించాలి.

ఇవీ అకడమిక్‌ క్యాలండర్‌లోని ప్రధాన అంశాలు
ఫిబ్రవరి 1: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం
మే 26 : చివరి పని దినం
మే 27 – జూన్‌ 13 : వేసవి సెలవులు
పరీక్షల షెడ్యూల్‌
మార్చి 15 లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్ష
ఏప్రిల్‌ 15 లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్ష
మే 7 – మే 13 :  9వ తరగతికి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలు
మే 17 – మే 26 : పదో తరగతి పరీక్షలు.
(మార్చి/ఏప్రిల్‌లో సైన్స్‌ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్‌గానే నిర్వహించాలి)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు