కాయ కష్టం చేసి రూ. 1.5 లక్షలు దాచుకుంటే.. చెద తినేసింది!

23 Sep, 2022 01:58 IST|Sakshi
చెద పట్టిన రూ.2 వేలు, రూ.500 నోట్లు, మేస్త్రీ గడ్డం లక్ష్మయ్య

లబోదిబోమంటున్న సుతారి మేస్త్రీ

ఇల్లెందు: రెక్కలు ముక్కలు చేసుకుని పొదుపు చేసిన డబ్బు చెద పడితే..? అదే జరిగింది. దాచుకున్న రూ.1.5 లక్షలనోట్లు చెద పట్టడంతో ఒక సుతారి మేస్త్రీ లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలాజీనగర్‌ పంచాయతీ సమ్మక్క గద్దెల వద్ద నివసించే గడ్డం లక్ష్మయ్య సుతారి మేస్త్రీ. రోజూ సంపాదించే ఆదాయంలో కొంత డబ్బును ఇంట్లోని సజ్జెపై సూట్‌కేసులో భద్రపరుస్తున్నాడు.

అలా రూ.1.5 లక్షలు దాచాడు. ఇటీవలి వర్షాలకు గోడలు నాని సజ్జెకు చెమ్మ రావడంతో చెదపట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆయన సూట్‌ కేసు తెరిచి చూసేసరికి అందులోని రూ.2 వేలు, రూ.500 నోట్లను చెద పురుగులు తినేశాయి. ఆ నోట్లతో గురువారం ఇల్లెందులోని మూడు బ్యాంకులకు వెళ్లగా హైదరాబాద్‌కు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. హైదరాబాద్‌ వెళ్లే స్తోమత లేని తనను ఎవరైనా ఆదుకోవాలని లక్ష్మయ్య కోరుతున్నాడు. 

మరిన్ని వార్తలు