దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని

6 Sep, 2022 01:30 IST|Sakshi

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): పండుగలు, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం తగదని, ఈ నెల 9న గణేశ్‌ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వమే ఘనంగా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని, చేతకాకపోతే తామే నిర్వహిస్తామని.. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవసమితి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోమవారం ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలసంఖ్యలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, రవా ణా, ఆర్‌అండ్‌బీ తదితర ప్రభుత్వ విభాగాలన్నీ కలసి చేసే కార్యక్రమం వారి వల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఉత్సవసమితి నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ జరుగుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.

ట్యాంక్‌బండ్‌లో గణేశ్‌ నిమజ్జనం చేయనివ్వకపోతే ప్రగతిభవన్‌లో నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యాఖ్యలు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్నా’ అని (నవ్వుతూ) అన్నారు. కాగా, ఒకరి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని, హిందువుల పండుగలు జరిపించడంలేదనే పిచ్చి మాటల నుంచి కొందరు వ్యక్తులు బయటకు రావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి అన్ని పండుగలూ సమానమేనన్నారు.

ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్‌’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే!

మరిన్ని వార్తలు