మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాల్లేవు 

28 Oct, 2023 02:12 IST|Sakshi

డిజైన్‌లో లోపం ఉంటే బ్యారేజీ కొట్టుకుపోయేది 

గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు 

కుంగుబాటుకు గల కారణాలు గుర్తించాకే మరమ్మతులు 

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవ ని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నా రు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై ఆయన శుక్రవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్‌ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారే జీ తట్టుకుందని రజత్‌కుమార్‌ చెప్పారు.

బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్‌ నంబర్‌ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్‌ మెయిన్‌ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పియర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ అనుమతించాలని తెలిపారు.

జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్‌సీ (సాధారణ) మురళీధర్, ఈఎన్‌సీ (పరిపాలన) అనిల్‌కుమార్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్రరావు, ఈఎన్‌సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ (కరీంనగర్‌) శంకర్, నీటిపారుదల అదనపు కార్యదర్శి భీం ప్రసాద్, సీడీవో సీఈ మోహన్‌కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో శనివారం బ్యారేజీని పరిశీలించనున్నట్లు రజత్‌కుమార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు