బెల్టు షాపులు లేకుండా చేస్తాం: ప్రవీణ్‌కుమార్‌ 

30 Mar, 2022 02:39 IST|Sakshi
కనగల్‌ మండల కేంద్రంలో మాట్లాడుతున్న ప్రవీణ్‌  

కనగల్‌: బీఎస్పీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు లేకుండా చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. 24వ రోజుకు చేరిన బహుజన రాజ్యాధికార యాత్ర మంగళవారం కనగల్‌లో కొనసాగింది. కనగల్‌ నుంచి క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించిన ప్రవీణ్‌కుమార్‌ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు.

మద్యానికి బానిసలై చాలా మంది చిన్నవయస్సులోనే అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏమోగానీ రాష్ట్రం మద్యం విక్రయించడంలో మాత్రం నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. కూలీలుగా ఉన్న బడుగుబలహీన వర్గాలను ఓనర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏనుగు గర్తుకు ఓటేసి, ప్రగతి భవన్‌పై నీలిజెండా ఎగురవేసేందుకు బడుగు బలహీనవర్గాలు పాటుపడాలని పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు