థర్మాకోల్‌ తెప్ప బోల్తా.. విద్యార్థులు సురక్షితం 

23 Sep, 2022 04:59 IST|Sakshi

కాగజ్‌నగర్‌ టౌన్‌: కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి పెద్దవాగులో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు థర్మాకోల్‌ తెప్ప బోల్తా పడింది. నలుగురు పాఠశాల విద్యార్థులు, ఇద్దరు కూలీలను తెప్పపై ఒడ్డుకు చేర్చుతుండగా ఒక్కసారిగా ఒకవైపు ఒరగడంతో వాగులో పడిపోయారు. కొందరు వాగులో నడుస్తూ తెప్పపై కూర్చోబెట్టి వాగు దాటిస్తుంటారు. ఇలా దాటిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.

దాటిస్తున్న ముగ్గురు వ్యక్తులు పడిపోయిన వారిని వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చారు. బ్యాగులు, కూలీల సెల్‌ఫోన్లు వాగులో పడిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందవెల్లి పెద్దవాగుపై ఉన్న వంతెన ఇటీవలి భారీ వర్షాలకు కుంగిపోయింది. అధికారులు ఆ వంతెన మార్గాన్ని మూసివేయడంతో గత్యంతరం లేక ఇలా తెప్పలపై దాటుతున్నారు. తహసీల్దార్‌ ప్రమోద్‌ తెప్పలపై తరలింపును నిలిపి వేయించారు.   

మరిన్ని వార్తలు