బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!

8 Aug, 2020 13:41 IST|Sakshi

దొంగిలించిన బ్యాగులో నుంచి బంగారు పుస్తెల తాడు వదిలి..

రూ.2 వేల నగదు మాత్రమే తీసుకున్న దొంగ

అతడి వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన ఇంటి యజమాని, పోలీసులు

ఖమ్మంక్రైం: అతడికి ఏ అవసరం వచ్చిందో కానీ రూ.2 వేల కోసం దొంగతనం చేశాడు. అంతకుమించి ఎంత దోచుకున్నా వద్దనుకున్నాడు. లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాడు. రూ.2 లక్షల విలువైన బంగారు పుస్తెల తాడును బ్యాగులోనే ఉంచి.. కేవలం రూ.2 వేల నగదు మాత్రమే తీసుకున్నాడు. బంగారం బ్యాగులోనే ఉంచి చెట్టుకుండీలో వేసి వెళ్లాడు. తాను చేసిన దొంగతనాన్ని నిజాయతీగా ఒప్పుకొని మరీ అక్కడే ఉన్న గోడపై రాసి వెళ్లాడు. ఇదేదో సినిమా, సీరియల్‌ కథలా ఉన్నా.. ఇటువంటి వింత దొంగతనం ఖమ్మం నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని మామిళ్లగూడెంలో రిటైర్డ్‌ ఉద్యోగి బాబ్జీ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ దొంగ కిటికీలకు ఉన్న జాలీ డోర్‌ను కత్తిరించి.. కర్ర సహాయంతో ఇంట్లో గోడకు తగిలించి ఉన్న బ్యాగును చప్పుడు కాకుండా బయటకు తీశాడు.

అందులో రూ.2 వేల నగదుతో పాటు రూ.2 లక్షల విలువైన బంగారు పుస్తెల తాడు ఉంది. బ్యాగును ఎత్తుకెళ్లిన దొంగ అందులో ఉన్న రూ.2 వేలు మాత్రం తీసుకున్నాడు. బంగారు పుస్తెల తాడును అక్కడే ఉన్న చెట్టుకుండీలో పెట్టాడు. ఇంతటితో ఆగకుండా తనకు వచ్చీరాని తెలుగులో కుండీ పక్కనే ఉన్న గోడపై ‘నాకు డబ్బులు అత్యవసరం కావడంతో తీసుకున్నా.. మీ బంగారం ఇక్కడే చెట్టు కుండీలో వదిలి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’ అని రాశాడు. అయితే ఉదయం నిద్రలేచిన బాబ్జీ కుటుంబ సభ్యులు కిటికీకి ఉన్న జాలీ కట్‌ చేసి ఉండటం, ఇంట్లో గోడకు తగిలించి ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ బయటకొచ్చారు. ఇంటి పరిసరాల్లో వెతుకుతుండగా కిటికీ పక్కనే గోడపై దొంగ రాసిన రాతలు చదివి.. చెట్టు కుండీలో ఉన్న బ్యాగ్‌ను, అందులో ఉన్న బంగారు పుస్తెల తాడును చూసి ఒక వైపు ఆశ్చర్యపోతూనే మరోవైపు ఆనందపడ్డారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, స్థానికులకు తెలియడంతో అందరూ దొంగ గోడపై రాసిన రాతలు చూసి ఆశ్చర్యపోయారు.  

మరిన్ని వార్తలు