పెళ్లి మంటపంపైనే నగలు చోరీ

24 Dec, 2020 08:08 IST|Sakshi

మహిళకు మత్తుమందు ఇచ్చి 

35 తులాల బంగారం అపహరణ

ఇద్దరు అనుమానితులను గుర్తించిన పోలీసులు

డిచ్‌పల్లి : వివాహ వేదికపైనే సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు రెప్పపాటులో దోచుకెళ్లారు. ఆనందంగా పెళ్లి వేడుకలో మునిగిన వరుడు, వధువు, వారి బంధువులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. సిద్దిపేటకు చెందిన ఫణీంద్రకు, మహారాష్ట్ర ఉమ్రికి చెందిన కావ్యతో డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌ శివారులోని బృందావనం గార్డెన్స్‌లో బుధవారం పెళ్లి జరిగింది.

పెళ్లి జరగుతున్న సమయంలో 25, 30 ఏళ్ల వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి ముందు వరస కుర్చీల్లో కూర్చున్నారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ఫొటోలు దిగేందుకు తన బంగారు నగలను తరచూ మార్చుతూ ఉంది. నగలను సమీప బంధువైన ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగులో ఉంచారు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకరు స్టేజీ పైకి చేరుకుని నగలు పట్టుకున్న మహిళకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చాడు.

ఆ మహిళ మైకంలో ఉన్న సమయంలోనే ఆమె వద్ద ఉన్న నగల బ్యాగును ఓ ప్లాస్టిక్‌ కవర్లో పెట్టుకుని ఇద్దరు దొంగలు క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. కొద్దిసేపటికి మైకం నుంచి కోలుకున్న మహిళ నగల బ్యాగు కన్పించక పోవడంతో ఆందోళనగా విషయాన్ని పెళ్లి వారికి తెలిపింది. దీంతో అప్పటివరకు ఎంతో హుషారుగా సాగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్‌కుమార్‌ సీసీ టీవీ పుటేజీలతో పాటు పెళ్లి వేడుకల్లో రికార్డు చేసిన వీడియోలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు.

మరిన్ని వార్తలు