Hyderabad: మందుబాబుకు 30 రోజుల జైలు 

8 Oct, 2022 08:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగి వాహనం నడపవద్దని పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసే వాహనదారుల కళ్లు బైర్లుకమ్మేలా కోర్టు తీర్పు వెలువరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజుల జైలు శిక్ష విధించింది. వరుసగా నాలుగుసార్లు డ్రంకన్‌ డ్రైవ్‌ (డీడీ) కేసులలో గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన సదరు మందుబాబుకు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. రక్తంలో ఆల్కాహాల్‌ స్థాయి (బీఏసీ) 50గా ఉంది. ఇక, శంషాబాద్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో పట్టుబడిన మరో మందుబాబుకు 22 రోజుల పాటు జైలు శిక్ష ఖరారైంది. ఈయన బీఏసీ 550గా నమోదయింది. 

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గత నెలలో 3,835 డీడీ కేసులు నమోదయ్యాయి. 93 మందికి కోర్టు జైలు శిక్షను, రూ.1.21 కోట్లు జరిమానాను విధించింది. కాగా గత నెలలో 18 మంది మైనర్‌ మందుబాబులు పట్టుబడ్డారు. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.22 వేలు జరిమానా ఖరారు చేసింది. మొత్తం 479 మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌) రద్దు కోసం ట్రాఫిక్‌ పోలీసులు సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లకు సిఫార్సు చేశారు. అత్యధికంగా 615 డీడీ కేసులు రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో నమోదయ్యాయి. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.18.52 లక్షలు జరిమానా, మొత్తం 13 మందికి జైలు శిక్షను విధించింది. ఏకంగా 153 మంది వాహనదారుల డీఎల్‌ రద్దుకు ఆదేశించారు. 

చదవండి: (మాగుంట కుటుంబంలో విషాదం)

మరిన్ని వార్తలు