నెలవారీ సమీక్షలతో ‘తొలిమెట్టు’ 

17 Dec, 2022 08:49 IST|Sakshi

డీఈవోలతో ఉన్నతాధికారుల సమీక్ష

సబ్జెక్టులవారీగా విశ్లేషణ.. సూచనలు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాల మెరుగుకు ఉద్దేశించి చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లావిద్యాశాఖ అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. పురోగతిని ప్రతినెలా సాంకేతికంగా నమోదు చేస్తున్నప్పటీకీ, బోధన ప్రక్రియల్లో వినూత్న మెలకువలు అమలు చేస్తున్నా ఇంకా చాలాపాఠశాలల్లో విద్యార్థులు వెనుకబడే ఉన్నారని తెలిపారు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులు నిమిషానికి 30 నుంచి 50 పదాలు కూడా ధారాళంగా చదవలేకపోవడాన్ని అధికారులు డీఈవోల దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు పథకం అమలు తీరుపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన శుక్రవారం డీఈవోలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు సంబంధించి సబ్జెక్టులవారీగా విశ్లేషించి, కొన్ని సూచనలు చేశారు.  

తెలుగులో... 
రెండు తరగతుల వరకూ బోధించిన అక్షరా లు, గుణింతాలు ఒత్తులపై స్పష్టత ఇవ్వాలి. గేయాల్లో బట్టీ విధానం కాకుండా, అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. ధ్వని ఆధారంగా పదాలు చెప్పేలా చూడాలి. గుం డ్రంగా అక్షరాలు రాసేలా చూడాలి. 3–5 తరగతుల్లో బోధించేపాఠాల్లో అక్షరాల ఆధా రంగా పదాలు తయారు చేసేలా చూడాలి.  

ఒకటి, రెండు తరగతుల్లో రాయడం, 3–5 తరగతుల్లో చేతిరాత అందంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రమాణాలవారీగా బోధన విధానాలు అమలు చేయాలి.  

ఇంగ్లిష్‌లో... 
స్పష్టంగా పదాలు పలికేలా చూడాలి. పదాలకు అనుగుణంగా చిత్రాలు గుర్తించడం, చదివించడం, రాయించడం చేయాలి. ప్రతిరోజూ నిర్ధారించిన బోధనాభ్యసన ప్రక్రియలను ధ్వనులు, గుర్తించడం, రాయించడం ద్వారానే చేపట్టాలి.  

గణితంలో... 
ఏ యూనిట్‌ బోధించినా వాటిలోని గణిత భావనలపట్ల సామగ్రిని ఉపయోగించి అవగాహన కల్పించాలి. చిత్రాలు వాడటం వల్ల తేలికగా అర్థమవుతుంది. సంఖ్యలు నేర్చించడానికి వాచకంలో సరైన విధానాలు, ప్రక్రియలు ఉన్నాయి వాటిని ఉపయోగించాలి. 3–5 తరగతుల్లో బోధన చేసేప్పుడు పూర్వ భావనలను అవగాహన కల్పించి, అభ్యాసం చేయించడానికి ప్రయత్నించాలి. 

ఇక చేయాల్సింది ఇదీ.. 
తొలిమెట్టు బోధన విధానాలపై ఇచ్చిన సూచనలను ప్రతీ టీచర్‌కు చేరవేసేందుకు డీఈవోలే చొరవ తీసుకోవాలని, దీనికోసం కాంప్లెక్సు సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు డీఈవోలకు సూచించారు. తొలిమెట్టులో విజయం సాధించిన పాఠశాలలను గుర్తించి వారి అనుభవాలను ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు. తొలిమెట్టులో క్రియాశీలపాత్ర పోషించేవారిలో మండలానికి ఒకరి చొప్పున టీచర్‌ను గుర్తించాలని సూచించారు. వారి పురోగతి వివరాలను ఫొటోతోసహా ఈ నెలాఖరుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. టీచర్లందరికీ సబ్జెక్టులవారీగా ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఇక నుంచి రాష్ట్రస్థాయిలో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సాహం ఇస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు