'ఆ నలుగురు' ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్‌.. 4 ఠాణాల్లో ఫిర్యాదులు..

14 Nov, 2022 02:27 IST|Sakshi

రాయదుర్గంలో రోహిత్‌రెడ్డి.. గచ్చిబౌలిలో బాలరాజు .. 

బంజారాహిల్స్‌లో హర్షవర్ధన్‌ .. ఘట్‌కేసర్‌లో కాంతారావు 

కేసులు నమోదు .. దర్యాప్తు షురూ

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసుకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఈ మేరకు వారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఫిర్యాదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఘట్‌కేసర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి బంజారాహిల్స్‌ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌ను కలిసిన రోహిత్‌ రెడ్డి తనకు ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన 11 ఫోన్‌ నంబర్ల నుంచి తరచూ కాల్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిçస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. 

ఆరుకు చేరిన కేసుల సంఖ్య 
ఫామ్‌హౌస్‌ ఘటనలో ప్రధాన, అనుబంధ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ‘ఎర’కు సంబంధించిన ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలపై మొయినాబాద్‌ ఠాణాలో నమోదైన కేసు మొదటిది కాగా.. ఆ తర్వాత రామచంద్రభారతి రెండేసి ఆధార్, పాన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కలిగి ఉన్నాడంటూ బంజారాహిల్స్‌లో మరో కేసు నమోదయింది. తాజాగా నమోదైన నాలుగు కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. 

రోహిత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ 
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అధికారులు.. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఎమ్మెల్యే ఇంటికెళ్లిన అధికారులు రెమా రాజేశ్వరి, కల్మేశ్వర్‌ శింగేనవర్‌.. నిందితులు ఆయన్ను ఎలా సంప్రదించారు? పార్టీ మారితే ఏం ఇస్తామని ఆఫర్‌ చేశారని ప్రశ్నించి..ఆ మేరకు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు.
చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్‌.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్‌ ఫోకస్‌

మరిన్ని వార్తలు