మహిళలను బెదిరించి బంగారం చోరీ

12 Dec, 2021 11:27 IST|Sakshi

ములుగు(గజ్వేల్‌): మాయమాటలతో ఓ మహిళను పరిచయం చేసుకొని ఆమె ఇంటికి వెళ్లి బెదిరించి ఇంట్లోని బంగారం, వెండిని ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని కొక్కొండలో  చోటు చేసుకుంది. ఎస్సై రంగకృష్ణ వివరాల ప్రకారం కొక్కొండకు చెందిన కుర్మ ఎల్లమ్మ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఎల్లమ్మ కొత్తూరుకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి వస్తుండగా మేడ్చల్‌కు చెందిన కైరంకొండ సంతోషి మాయమాటలతో పరిచయం చేసుకొని, ఎల్లమ్మతోపాటు ఇంటికి వెళ్లింది.

రాత్రి భోజనం చేసిన అనంతరం కొడవలి తీసుకొని ఎల్లమ్మను, ఆమె కూతురు మల్లమ్మను చంపుతానని బెదిరిస్తూ వారి మెడలో ఉన్న సుమారు రూ.లక్షా 52వేల విలువైన ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు , 15 తులాల వెండిని దొంగిలించుకొని ఇంటిబయట గొళ్లెం పెట్టి పారిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై రంగకృష్ణ సిబ్బంది గాలింపు చేపట్టి 12గంటల్లో చోరీకి పాల్పడిన సంతోషిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించి, సంతోషిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు