ఓటముల ఎఫెక్ట్‌.. తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లపై వేటు!

25 Nov, 2022 14:41 IST|Sakshi

తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్‌ సైతం కోల్పోయింది. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌ బలోపేతంపై హైకమాండ్‌ కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే టీపీసీసీ కొత్త కార్యవర్గంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లను మార్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌లను తొలగించే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో అందరినీ కలుపుకునిపోవాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి అధిష్టానం సూచించింది. కాగా, పదవుల నుంచి తొలగించిన వారికి పొలిటికల్ ఎఫైర్‌ కమిటీలో సర్దుబాటు చేసే విధంగా టీమ్‌ కూర్పు జరుగుతోంది. ఇక, కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఎన్నికల ఎఫెక్ట్‌తోనే..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు కార్యవర్గ కూర్పు జరగలేదు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలు చేయలేదు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు కోసం నేతల నుంచి డిమాండ్‌ వస్తున్నా.. పదవుల పంపకాల్లో తేడాలు వస్తే గ్రూప్‌ వార్‌లు పెరుగుతాయన్న కారణంతో నాన్చుతూ వచ్చారు. ఇప్పుడు ఏడాదిలోగా ఎన్నికలు ఉండటంతో పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఆ దిశగా కొత్త కార్యవర్గ ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని అధిష్టానం పెద్దలు సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు కసరత్తు చేపట్టారు. చాలా జిల్లాలకు కొత్త అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు