అవగాహన, పరీక్షలు, చికిత్స

6 Jul, 2022 01:38 IST|Sakshi

సీజనల్‌ వ్యాధుల కట్టడిపై మూడంచెల వ్యూçహానికి మంత్రి హరీశ్‌ ఆదేశం

ఐటీడీఏ ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించడం చేపట్టాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులపట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు పంచాయతీరాజ్‌ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.

గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందంతో ప్రచారం చేయాలన్నారు. మంగళవారం ఏటూరునాగారం, ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ర్నూల్‌ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలోని జిల్లాల్లో సీజనల్‌ వ్యాధులపై మంత్రి హరీశ్‌ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులను పూర్తిస్థాయిలో నియంత్రించాలని సూచించారు. ఎక్కడైనా కేసులు నమోదైతే ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా లక్షణాలు, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా బాధితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 108 వాహనాలు వెళ్లలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.

ప్రజలు నాటు వైద్యం, మూఢ నమ్మకాలను ఆశ్రయించకుండా చూడాలన్నారు. దోమ తెరలను విస్తృతంగా పంపిణీ చేయాలని, ఫాగింగ్, నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాశ్‌రావు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు
కాచిగూడ (హైదరాబాద్‌): ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలందేలా వెంటనే తగు చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే) ప్రతినిధులు మంగళవారం హరీశ్‌రావును కలిసి జర్నలిస్టుల వైద్య సమస్యలపై వినతిపత్రం అందించారు.

జర్నలిస్టు హెల్త్‌ స్కీం (జేహెచ్‌ఎస్‌) ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అమలు కావడం లేదని, వైద్యం చేయటానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని, దీంతో జర్నలిస్టు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యూనియన్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి నిరంజన్‌ మంత్రికి వివరించారు. ఆయన్ను కలిసిన వారిలో హెచ్‌యూజే నాయకులు పద్మరాజు, రాజశేఖర్, అరుణ్‌ తదితరులున్నారు.   

మరిన్ని వార్తలు