మానేరు వాగులో ఆరు గంటలు..

28 Sep, 2020 09:48 IST|Sakshi
రెస్క్యూ సిబ్బంది కాపాడిన ముగ్గురు యువకులు(తిరుపతి, నేదురు శ్రీనివాస్,‌ నేదురు రవి)

చేపలవేటకు వెళ్లి చిక్కుకుపోయిన ముగ్గురు యువకులు

చెట్టును పట్టుకుని ఇద్దరు, పైపును పట్టుకుని మరొకరు..

ఎల్‌ఎండీ గేట్లు మూసివేయడంతో తగ్గిన వరద ఉధృతి

కాపాడిన పోలీసులు, రెస్క్యూటీం 

వీణవంక మండలం చల్లూరు వద్ద ఘటన 

మానేరు వాగులో చేపల వేట కు వెళ్లిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన వరదకు అందులోనే చిక్కుకుపోయారు. చెట్టును పట్టుకుని ఇద్దరు, పైపును పట్టుకుని మరొకరు సుమారు ఆరు గంటలు నరకయాతన పడ్డారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు రెస్క్యూటీం సహకారంతో ముగ్గురినీ ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటన వీణవంక మండలం చల్లూరు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. 

సాక్షి, వీణవంక(హుజూరాబాద్‌): చల్లూరు గ్రామానికి చెందిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన తిరుపతి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మానేరు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. వాగు ఒడ్డు నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టును నేదురు శ్రీనివాస్, తిరుపతి పట్టుకున్నారు. నేదురు రవి వాగు ఒడ్డు నుంచి కిలోమీటర్‌ దూరం కొట్టుకుపోయి అక్కడ ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావి పైపు కనిపించడంతో దానిని పట్టుకున్నాడు.

సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా వాగు ఒడ్డు నుంచి వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కిరణ్‌రెడ్డి, సర్పంచ్‌ పొదిల జ్యోతిరమేశ్, ట్రస్మా అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి వెంటనే వాగు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో రక్షించేందుకు ప్రయణ్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. చదవండి: (ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..)

వాగులో ఆరుగంటలు...
సాయంత్రం 4 గంటలకు గల్లంతైన యువకులు రాత్రి 10 గంటల వరకు సుమారు ఆరు గంటలు వాగులేనే బిక్కుబిక్కు మంటు గడిపారు. కాపాడాలంటూ నేదురు శ్రీనివాస్, తిరుపతి రోదిస్తూ వేడుకున్నారు. నేదురు రవి అచూకీ కనుక్కోవడం కొంత ఆలస్యమైంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌కు చెందిన రెస్క్యూటీం సభ్యులు వాగు వద్దకు చేరుకుని మొదటగా రవిని రక్షించేందుకు ప్రయణ్నించారు. మూడుసార్లు రవి వద్దకు వెళ్లి వెనక్కు వచ్చిన సిబ్బంది చివరకు తాడు సహాయంతో రాత్రి 9.40 గంటలకు రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరినీ 10 గంటల సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో చచ్చి బతికామంటు వారు కన్నీటిపర్యంతమయ్యారు.

ఎల్‌ఎండీ గేట్లు మూయడంతో...
కరీంనగర్‌ ఎల్‌ఎండీకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో అధికారులు సాయంత్రం నీటి విడుదలను పెంచారు. సుమారు లక్ష క్యూసెక్కులు దిగువకు వదలడంతో మానేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. వరదను అంచనా వేయకుండా యువకులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ ఎల్‌ఎండీ గేట్లు మేసివేయాలని ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన గేట్లు మూసివేయడంతో వాగులో వరద ఉధృతి తగ్గుముఖంపట్టింది. దీంతో యువకులను కాపాడడం రెస్క్యూ సిబ్బందికి సులువైంది. 

హెలిక్యాప్టర్‌ తెప్పిస్తే బాగుండేది...
ముగ్గురు యువకులు ఆరు గంటలపాటు ప్రాణాపాయ స్థితిలో వాగులో కొట్టుమిట్టాడారు. హెలిక్యాప్టర్‌ సకాలంలో తెప్పిస్తే యువకులను త్వరగా కాపాడేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆరు గంటల జాప్యంలో యువకులు పట్టు కోల్పోతే ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంటున్నారు. వరదలో ఆరు గంటలు చుక్కలు చూశామని, అసలు ప్రాణాలతో బయటపడుతామని అనుకోలేదని బాధితులు తెలిపారు. తహసీల్దార్‌ కనకయ్య, ఎస్సై కిరణ్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ పొదిల్ల జ్యోతిరమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు