ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..

27 Sep, 2020 19:01 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: చేపల వేటకు వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు వద్ద మానేరు వాగులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులను శ్రీనివాస్‌‌, రవి, తిరుపతిగా గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మానేరు వాగులో చేపలు పడుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిందని, దాంతో ముగ్గురూ చిక్కుకుపోయినట్టుగా స్థానికులు వెల్లడించారు.

శ్రీనివాస్‌, రవి సురక్షిత ప్రాంతంలో ఉండగా, తిరుపతి ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఎడతెరిపిలేని వర్షాలతో దిగువ మానేరు నిండుకుండలా మారింది. 8 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో చల్లూరు వద్ద మానేరు వాగులో వరద ఉధృతి పెరిగింది. మానేరు వాగులో వరద ఉధృతిని తగ్గించేందుకు దిగువ మానేరు గేట్లను అధికారులు మూసివేశారు.
(చదవండి: వాగు మధ్యలో ప్రసవం.. )

మరిన్ని వార్తలు