ఒకే ఇంట్లో ముగ్గురు కోవిడ్‌తో మృతి

30 Jul, 2020 05:21 IST|Sakshi
సత్యనారాయణరెడ్డి, సుకుమారి, హరీష్‌రెడ్డి(ఫైల్‌)

23న అబ్బాయి, 28న బాబాయి, పిన్ని 

కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన మహమ్మారి  ∙

మృతుల స్వస్థలం మహేశ్వరంలోని దుబ్బచర్ల 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకవైపు అయినవారంతా కళ్లముందే కన్నుమూస్తుంటే...మరోవైపు ఆస్పత్రుల ధనదాహానికి కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురికావాల్సి వచ్చింది. 

వైరస్‌ ఎలా సోకిందంటే... 
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామానికి చెందిన ఆన్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి (60), భార్య సుకుమారి (55), కుమారుడితో కలిసి చంపాపేటలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. ఆయన సోదరుడి కుమారుడు అడ్వకేట్‌ అన్‌రెడ్డి హరీష్‌ రెడ్డి (37) తన భార్యాపిల్లలతో కలిసి ఇదే డివిజన్‌లోని రెడ్డికాలనీలో ఉంటున్నారు. భూ వివాదానికి సంబంధించిన అంశంపై వీరంతా ఇటీవల ఒకే కారులో స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లివచ్చారు. ఆ తర్వాతి మూడురోజులకే అడ్వకేట్‌ హరీష్‌రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన కోవిడ్‌ పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఆయన భార్య, ఐదేళ్ల కూతురికి కూడా పాజిటివ్‌ వచ్చింది. బాబాయ్‌ సత్యనారాయణ రెడ్డి, పిన్ని సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడికి కూడా వైరస్‌ నిర్ధారణ అయింది. జూలై మొదటి వారంలో హరీష్‌రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇన్సూరెన్స్‌పై చికిత్సలు అందించేందుకు వారు నిరాకరించడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 23న మృతి చెందారు. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు వెచ్చించినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు. 

ఆ తర్వాత పిన్ని, బాబాయ్‌... 
హరీష్‌రెడ్డికి కోవిడ్‌ నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన బాబాయ్‌ సత్యనారాయణరెడ్డి, పిన్ని సుకుమారికి కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. జూలై 10న వారిద్దరు చికిత్స కోసం తొలుత సోమాజిగూడలోని డెక్కన్‌ ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్‌ అయి హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన రెండ్రోజులకే సత్యనారాయణరెడ్డి తీవ్ర ఆయాసం, జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన్ను చికిత్స కోసం జూలై 15న మళ్లీ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు.

తర్వాత ఆయన భార్యకు కూడా శ్వాస సమస్యలు తలెత్తాయి. శరీరంలో ఆక్సిజన్‌ శాతం కూడా తక్కువగా ఉంది. ఆమెను కూడా డెక్కన్‌ ఆస్పత్రిలోనే చేర్పించేందుకు కుమారుడు యత్నించాడు. అయితే పడకలు లేవని చెప్పి ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. తెలిసిన వైద్యుడి సహాయంతో ఆమె గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శనివారం బ్రెయిన్ ‌డెడ్‌ స్థితికి చేరుకుంది. పరిస్థితి విషమించి మంగళవారం (28న) ఉదయం మృతి చెందగా, డెక్కన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త సత్యనారాయణరెడ్డి కూడా ఇదేరోజు రాత్రి మృతి చెందారు.  

ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూనే ఉన్నాం 
‘సత్యనారాయణరెడ్డికి కోవిడ్‌తో పాటు హార్ట్‌ , కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్సలు అందించాం. ఆయనకు వాడుతున్న మందులు, చేస్తున్న వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు వివరించాం. మల్టీపుల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయన్ను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు’అని డెక్కన్‌ ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. 

బిల్లు కోసం ఆస్పత్రి మెలిక 
‘మా అమ్మనాన్నలను చికిత్స కోసం ముందు డెక్కన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాను. కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసి కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. రెండు రోజుల తర్వాత నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లాను. 15వ తేదీన అడ్మిట్‌ చేశాను. పది రోజులకు రూ.17.50 లక్షల బిల్లు వేశారు. ఇప్పటికే రూ.8 లక్షలు చెల్లించాను. ఇదే సమయంలో నాకు కూడా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇటు అమ్మ దగ్గరకు, అటు నాన్న దగ్గరకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. బిల్లు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి వాళ్లు పదేపదే ఫోన్లు చేశారు. కోవిడ్‌ పేషంట్‌ని అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. నాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అమ్మ చనిపోయిన రోజే..నాన్న కూడా చనిపోయారు. మిగిలిన బిల్లు చెల్లిస్తేనే.. మృతదేహాం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం మెలికపెట్టింది. మీడియాను ఆశ్రయించడంతో చివరకు నాన్న మృతదేహాన్ని అప్పగించారు. నాలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు’అని కుమారుడు రాజేష్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు