ఆక్సిజన్‌ ప్లాంట్‌.. ‘మేడిన్‌ తెలంగాణ’!  

6 Jun, 2021 09:05 IST|Sakshi
తాము రూపొందించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను చూపిస్తున్న ఆక్సిఫ్లో ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆస్పత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్‌ కొరతను అధిగమించే లక్ష్యంతో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మిత్రులు వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించారు. స్థానికంగా లభించే విడిభాగాలతోనే సమర్థమైన పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను రూపొందించారు. తిరుపతి ఐఐటీ సహకారంతో చౌటుప్పల్‌లో పూర్తి స్వదేశీ ఆక్సిజన్‌ ప్లాంట్‌ సిద్ధం చేసినట్లు ఆ మిత్రులు స్థాపించిన కంపెనీ ఆక్సిఫ్లో శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కో యంత్రం నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగలదని, ఇది 93 నుంచి 95 శాతం స్వచ్ఛతతో కూడి ఉం టుందని వివరించారు. ఈ పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాం ట్‌ను ఆక్సి ఫ్లో అని పిలుస్తున్నారు. 

ఆ ముడిపదార్థంతోనే సమర్థంగా ఆక్సిజన్‌.. 
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ పూర్వ విద్యార్థులైన డిస్కవరీ ల్యాబ్స్‌ సీఈవో మన్నే ప్రశాంత్, ద యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మకోపియా సీనియర్‌ డైరెక్టర్‌ యడ్లపల్లి శిరీష, ఎకో వెంచర్స్‌ అండ్‌ ఎకోటెక్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ నరేడి ఆశి ష్‌లు తక్కువ సమయంలో సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ తయారీ దిశగా అడుగులు చేశారు. ఈ అంశంపైనే పరిశోధనలు చేస్తున్న తిరుపతి ఐఐటీ శాస్త్రవేత్త డాక్టర్‌ గుమ్మా శశిధర్‌ సహకారం తీసుకున్నారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ తయారీలో కీలకమైన జియోలైట్‌ పదార్థం దేశంలోనే అందుబాటులో లేని నేపథ్యంలో తక్కువ సామర్థ్యం ఉందన్న కారణంగా సోడియం ఆధారిత జియోలైట్‌ను దేశంలో వాడట్లేదన్న విషయాన్ని గుర్తించి దాంతోనే సమర్థంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి జరిగేలా కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఫలితంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ధర గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం తాము నెలకు 20 ఆక్సీ ఫ్లో యంత్రాలను తయారు చేయగలమని కంపెనీ వివరించింది.
చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్‌ వెంటే..

మరిన్ని వార్తలు