Nizamabad: రిపోర్టర్‌పై దాడి ఘటనలో ముగ్గురి అరెసు

24 Jan, 2022 05:46 IST|Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: ‘సాక్షి’దినపత్రిక మాక్లూర్‌ విలేకరి కమలాపురం పోశెట్టిపై జరిగిన దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వార్తల సేకరణ కోసం వెళ్తుండగా మాక్లూర్‌ మండల రిపోర్టర్‌ పోశెట్టిపై ఈ నెల 13న వల్లభాపూర్‌ వద్ద ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, పోలీసుల వ్యవహార శైలికి నిరసనగా జర్నలిస్టులు వరుస ఆందోళనలు చేపట్టారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి విన్నవించడంతో పాటు చలో మాక్లూర్‌ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. రిపోర్టర్‌పై దాడి ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామని, ఇందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిపోర్టర్‌ పోశెట్టి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, బ్రిలియంట్‌ స్కూల్‌ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు వివరించారు. దాడికి పాల్పడిన కె.సురేశ్, మహమ్మద్మోసిన్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి ప్రేరేపించిన మహేందర్, రంజిత్‌లపైనా కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు