అమెరికాలో ట్రక్కును ఢీకొన్న కారు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మృతి

27 Oct, 2022 09:03 IST|Sakshi
ప్రేమ్‌కుమార్‌రెడ్డి, పావని 

మృతుల్లో ఒకరు నల్లగొండ జిల్లా వాసి

మరొకరిది వరంగల్, ఇంకొకరిది తూర్పుగోదావరి

రామగిరి(నల్లగొండ)/వరంగల్‌ చౌరస్తా/కడియం: ఉన్నత చదువుల కోసం యూఎస్‌ వెళ్లిన ముగ్గురు తెలుగు విద్యార్థులు రెండు నెలల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొనడంతో ముగ్గు రూ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదోరిగూడెం గ్రామానికి చెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి(26)తో పాటు వరంగల్‌ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన ఎంఎస్‌ విద్యార్థిని గుళ్లపెల్లి పావని (22), ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన పాటంశెట్టి సాయి నరసింహ (25) ఉన్నారు.

గోదోరిగూడేనికి చెందిన లక్ష్మారెడ్డి, లలిత దంపతు ల పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్‌ అమెరికాలోని న్యూ యార్క్‌ సాక్రెడ్‌హార్ట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతు న్నారు. ఆగస్టు 23న అమెరికాకు వెళ్లారు. ఇదిలా ఉండగా, సోమవారం స్నేహితులతో కలిసి ప్రేమ్‌కుమార్‌ విహారయా త్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు.

దట్టమైన మంచు కురుస్తుండటంతో సరిగా కనిపించక ఎదురుగా వస్తు న్న ట్రక్కును వీరి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఏడుగురి లో ప్రేమ్‌కుమార్, పావని, సాయి నరసింహ అక్కడికక్కడే మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామ న్నపేట మండలం వెల్లంకి గ్రా మానికి చెందిన మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. చదువు కోసం అమెరికా వెళ్లి రెండు నెలలు గడవక ముందే ప్రేమ్‌ మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, అమెరికా నుంచి మృతదేహాలను తీసుకురావడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. స్వదేశానికి రావడానికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. 

కొద్ది నెలల కిందటే అమెరికాకు..
గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేశ్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రమేశ్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. పావని ఎంఎస్సీ కోసం రెండు నెలల కిందట అమెరికా వెళ్లింది. పావని దీపావళి రోజు కుటుంబ సభ్యులతో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు బంధువులు తెలిపారు. కాగా, బుర్రిలంకకు చెందిన సాయి నరసింహ 3 నెలల క్రితమే ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ వెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన ఐశ్వర్య ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతోంది. 

మరిన్ని వార్తలు