ఏటూరునాగారంలో ముగ్గురు టీచర్లకు కరోనా 

4 Sep, 2021 04:49 IST|Sakshi
విద్యార్థికి కరోనా పరీక్షలు చేస్తున్న సిబ్బంది  

ఏటూరునాగారం/కోస్గి: ములుగు జిల్లా ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే అధికారులు వారికి సెలవు ప్రకటించారు. బుధవారంనుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏటూరునాగారంలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో గురువారం రాత్రి ఇద్దరు పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. మరో ఉపాధ్యాయుడికి శుక్రవారం పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జి ఎంఈఓ సురేందర్‌ వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఆ ముగ్గురు ఉపాధ్యాయులకు సెలవు ఇచ్చి, తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. 

మీర్జాపూర్‌లో ఇద్దరు విద్యార్థినులకు కరోనా 
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కరోనా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలో ఒకరు పదోతరగతి చదువుతుండగా..మరొకరు అదే పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటోంది. బాధిత విద్యార్థినుల నాయనమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యం బారిన పడటంతో ఆమెకు రెండు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో శుక్రవారం కుటుంబసభ్యులందరికీ కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా ఇద్దరు అక్కచెల్లెళ్లకు కరోనా వచ్చినట్లు తేలింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతప్ప పైఅధికారులకు సమాచారం అందించగా..పాఠశాలకు తాత్కాలిక సెలవు ప్రకటించి శానిటైజ్‌ చేయించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.    

మరిన్ని వార్తలు