ఐఎస్‌ఎల్‌ పోటీల్లో పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్‌ ప్రతిభ  

28 Sep, 2022 04:35 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌ అభినందనలు 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు స్వచ్ఛత అవార్డులు దక్కాయి. ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) పోటీల్లో రాష్ట్రంలోని పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్‌ పట్టణాలు ఈ అవార్డులు సాధించాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. ఈ నెల 17న ఐఎస్‌ఎల్‌ పోటీని నిర్వహించగా, దేశంలోని 1,850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి.

వీటిలో తెలంగాణకు మూడు అవార్డులు రాగా, ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌ కింద వచ్చిన 16 అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కినట్లయింది. ఐఎస్‌ఎల్‌ పోటీల్లో భాగంగా అన్ని పట్టణాలు తాము చేపట్టిన ఫ్లాగ్‌ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్‌ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు.  

మూడు కేటగిరీల్లో అవార్డులు 
జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా జరిగిన పోటీలో 15వేల లోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో అలంపూర్‌ అవార్డుకు ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈ నెల 30న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డులు పొందిన పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్‌ పురపాలికలకు మంత్రి కె.తారకరామారావు అభినందనలు తెలిపారు.    

కేంద్రం నుంచి సహకారం లేకపోయినా... 
కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ అవార్డులు సాధించిందని మంత్రి అన్నారు. కాగా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, అభివృద్ధి చేస్తున్న సీఎంలకు సహకరిస్తే దేశం బాగుపడుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదని... అధికారం ఉన్నపుడు మంచి చేస్తే చరిత్రలో నిలుస్తారన్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రానికి అవార్డులకు బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు